ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో భాగంగా.. రీసెంట్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు తర్వాతి మ్యాచులకు ఆడతాడా లేదా అనేది సందిగ్ధంగా మారింది. అయితే ఇప్పుడతడు మిగతా మ్యాచులకు దూరమవ్వనున్నాడని దాదాపుగా స్పష్టమైంది. అతడికి స్థానంలో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా కృనాల్ పాండ్య జట్టును నడిపిస్తాడని సమాచారం.
అయితే కేఎల్ రాహుల్ గాయం తీవ్రమైందని, అతడి గాయానికి సంబంధించిన విషయాన్ని బీసీసీఐ టేకప్ చేసిందని తెలిసింది. ఐపీఎల్లో తదుపరి మ్యాచుల్లో అతడు ఆడాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం కూడా బోర్డే తీసుకోనుందని సమాచారం. రాహుల్ బీసీసీఐ కాంట్రాక్ ప్లేయర్ కావడం, వచ్చే నెలలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఉన్న నేపథ్యంలో అతడి గాయం విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుందట. తద్వారా ఇక నుంచి అతడు ఎన్సీఏ సలహా మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది.
"కేఎల్ రాహుల్ ప్రస్తుత లఖ్‌నవూ టీమ్‌తోనే ఉన్నాడు. గురువారం సీఎస్కేతో మ్యాచ్ జరిగాక క్యాంప్‌ను వీడుతాడు. అతడికి గాయానికి సంబంధించి స్కానింగ్‌లను ముంబయిలో బీసీసీఐ ఏర్పాటు చేసిన మెడికల్ ఆధ్వర్యంలోనే చేయిస్తారు. బీసీసీఐ అతడి కేసును హ్యాండిల్ చేస్తుంది. ఇలాంటి గాయం తగిలినప్పుడు నొప్పి, వాపు కనీసం 24 నుంచి 48 గంటలకు వరకు ఉంటుంది. అప్పటికీ తగ్గకపోతే స్కానింగ్ నిర్వహిస్తాం. అతడు టెస్ట్ టమ్లో కీలకమైన ప్లేయర్. కాబట్టి అతడు ఐపీఎల్ తదుపరి మ్యాచుల్లో అడకపోవడమే మంచిది. స్కానింగ్ చేసిన తర్వాత అతడికి ఎలాంటి చికిత్స అందించాలో, ఆడే విషయంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది" అని ఓ బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు.
ఇకపోతే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు తొమ్మిది మ్యాచులు ఆడింది. అందులో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ లీగ్ కీలక ప్లేఆఫ్స్ దశకు చేరుతున్న తరుణంలో.. రాహుల్ గాయం కారణంగా దూరం అవ్వడం లఖ్‌నవూ పెద్ద దెబ్బ అనే చెప్పాలి. కాగా ఈ పాయింట్ల పట్టికలో.. గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా.. రాజస్థాన్ -రెండో స్థానం, చెన్నై-నాలుగు, ఆర్సీబీ-ఐదు, పంజాబ్- ఆరో స్థానంలో ఉన్నాయి. ఫలితంగా ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి.
ఇదీ చూడండి:IPL 2023 highest individual score : అగ్రస్థానంలో యశస్వి, వెంకటేశ్.. టాప్-10లో ఇంకా ఎవరున్నారంటే?