ఫామ్ లేమితో టీమ్ఇండియాలో చోటు కోల్పోయిన కొందరు సీనియర్ ప్లేయర్లు ఐపీఎల్లో రెచ్చిపోతున్నారు. ఈ టోర్నీలో సత్తా చాటి ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్‌కు ఎంపికవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. వారెవరంటే...
చాహల్ సూపర్ హిట్: యుజ్వేంద్ర చాహల్ గత రెండేళ్లలో టీమ్‌ఇండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా తక్కువ మ్యాచ్‌లే ఆడాడు. వన్డేల్లో 7, టీ20ల్లో 9 మ్యాచ్‌లే ఆడటంతో జట్టులో సుస్థిర స్థానం కోసం అవస్థలు పడ్డాడు. కానీ, ఇప్పుడు జరుగుతోన్న 15వ సీజన్‌లో రాజస్థాన్ తరఫునే కాకుండా మొత్తం టోర్నీలోనే లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7.09 ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు. ఇలాగే రాణించి రాబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం సాధించి మళ్లీ సత్తాచాటాలని చూస్తున్నాడు.
కుల్దీప్ బంపర్ హిట్: టీమ్‌ఇండియాలో చాహల్ కన్నా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు మణికట్టు స్పిన్ స్పషలిస్టు కుల్‌దీప్ యాదవ్. గత రెండేళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వన్డేలు, 3 టీ20లే ఆడిన అతడు ఈ టీ20 లీగ్‌లో గతేడాది ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంతకుముందు సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌లే ఆడాడు. ఈ క్రమంలోనే ఈసారి దిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీస్తున్న బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు అతడు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 8.47 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. మున్ముందు కూడా ఇలా మెరిసి మళ్లీ టీమ్‌ఇండియాలో పాగా వేయాలని భావిస్తున్నాడు.
ధావన్ ధానాధన్: ఇక 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియాలో పూర్తిస్థాయి ఓపెనర్‌గా చోటు కోల్పోయిన శిఖర్ ధావన్.. గత రెండేళ్లలో 10 వన్డేలు, 10 టీ20లే ఆడాడు. అయితే, ఈ టీ20 లీగ్‌లో మెరుస్తున్నా.. మునుపటిలా తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు పంజాబ్ ఓపెనర్‌గా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అతడు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 43.14 సగటుతో మొత్తం 302 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ధావన్ ఇలాగే రెచ్చిపోతే మళ్లీ టీమ్ఇండియాలో మెరిసే అవకాశం ఉంది.
దినేశ్ కార్తీక్ సంచలనం: చాలాకాలంగా ఫామ్ కోల్పోయి.. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అసలు టీమ్‌ఇండియాలోనే చోటు కోల్పోయిన ఆటగాడు దినేశ్ కార్తీక్. మరోవైపు ఈ టోర్నీలోనూ గత రెండు సీజన్లలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కానీ, ఈసారి బెంగళూరు తరఫున ఫినిషర్‌గా అదరగొడుతున్నాడు. సంచలన ఇన్నింగ్స్‌లతో ఆ జట్టుకు పలు విజయాలు అందించాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అతడు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 72 సగటుతో 216 పరుగులు చేశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా కార్తీక్ బెంగళూరు ఫినిషర్‌గా మెరుస్తున్నాడనడంలో సందేహం లేదు. ఇకపై ఆడే మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టును విజయతీరాలకు చేరిస్తే మళ్లీ టీ20 ప్రపంచకప్‌లో చోటు ఖాయమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.