ఐపీఎల్ ఎంట్రీతో క్రికెట్ ప్రపంచంలో లెక్కలే మారిపోయాయి. దాదాపు రెండు నెలలకుపైగా సాగే ఈ మెగా టోర్నీలో భాగమయ్యేందుకు అన్ని దేశాల క్రికెటర్లు ఆసక్తి చూపిస్తారు. ఐసీసీ నిర్వహించే టోర్నీలకు దీటుగా ఐపీఎల్‌కు డిమాండ్ పెరిగింది. అందుకే ఈ ఏడాది మరో రెండు జట్లను ప్రవేశపెట్టి ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అందించింది బీసీసీఐ. ఈ సీజన్ సూపర్‌హిట్ కావడం వల్ల మీడియా హక్కులకు కూడా విపరితంగా డిమాండ్ పెరిగింది. వచ్చే ఐదేళ్లకుగాను మీడియా ప్రసార హక్కులు రూ.48,390 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ జోష్ మరింత పెంచేలా కీలక ప్రకటన చేసింది బీసీసీఐ.
ఐపీఎలా.. మజాకా.. ఇక నుంచి టోర్నీ కోసం ఐసీసీ ప్రత్యేక షెడ్యూల్!
ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ ఓ ఆసక్తికర ప్రకటనను విడుదల చేసింది. ఇకపై భవిష్యత్తులో ఐపీఎల్ కోసం ఐసీసీ క్యాలెండర్లో ప్రత్యేక షెడ్యూల్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపింది. టోర్నీలోని మ్యాచ్‌ల సంఖ్యను కూడా 94కు పెంచనున్నట్లు పేర్కొంది.
స్పెషల్‌గా ఐపీఎల్ కోసం: ఏటా ఐపీఎల్లో వివిధ దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నా.. ముందుగా ఉన్న షెడ్యూల్స్ కారణంగా కొంతమంది ఐపీఎల్‌ను మిస్ అవుతున్నారు. దీంతో తమ అభిమాన ప్లేయర్ జట్టులో లేడని ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు ఆ లోటును కూడా బీసీసీఐ భర్తీ చేసేసింది. ఇకపై కేవలం ఐపీఎల్ కోసం అన్ని క్రికెట్ బోర్డులు ప్రత్యేక షెడ్యూల్‌ను కేటాయించేలా తీర్మానించింది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలపడంతో లైన్ క్లియరైంది. ఐసీసీ తయారు చేసే తదుపరి క్యాలెండర్లో ఐపీఎల్ కోసం రెండున్నర నెలలు కేటాయించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. అంతేకాదు.. భవిష్యత్తులో ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య 94కు పెంచనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి :బాక్సింగ్ దిగ్గజానికి కుర్రాడి ఛాలెంజ్.. 'ఆ 50 మంది చేయలేనిది నేను చేస్తా'