తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్: అయ్యో.. వీరికి సీజన్​ మొత్తం నిరాశే! - బ్రెండన్ టేలర్ సన్​రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్​లో పాల్గొన్నా జట్టు తరఫున ఒక్క మ్యాచ్​ కూడా ఆడకుండానే సీజన్ ముగించిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఇందులో కొందరు స్టార్ క్రికెటర్లూ ఉన్నారు. వారెవరో చూద్దాం.

ipl
ఐపీఎల్

By

Published : May 11, 2021, 9:46 AM IST

ఐపీఎల్​లో అత్యుత్తమ ఆటగాళ్లు పాల్గొంటారు. లీగ్ విజేతగా నిలవడమే లక్ష్యంగా బరిలో దిగే ఫ్రాంచైజీలు వేలంలో కోట్లు పెట్టి ఓవర్సీస్ ప్లేయర్లను కొనుగోలు చేస్తూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు అత్యుత్తమ క్రికెటర్ అనుకున్నా.. అతడికి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. జట్టులో కేవలం నలుగురు విదేశీ క్రికెటర్లు మాత్రమే ఉండాలన్న నిబంధన, తుదిజట్టులో సరైన కూర్పు వంటి కారణాల వల్ల కొందరు ఆటగాళ్లకు అవకాశం దక్కకపోవచ్చు. అయితే కొందరు స్టార్ క్రికెటర్లు జట్టులో ఉన్నా.. సీజన్​ మొత్తానికి బెంచ్​కే పరిమితమయ్యారంటే నమ్మగలమా.? వారెవరో చూసేయండి మరి.

జస్టిన్ లాంగర్ (రాజస్థాన్ రాయల్స్)

ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు కోచ్​గా వ్యవహరిస్తున్నాడు జస్టిన్ లాంగర్. టెస్టు స్పెషలిస్ట్​గా గుర్తింపు పొందిన ఇతడు చాలా తక్కువ వన్డేలు ఆడాడు. మొత్తంగా 100 టెస్టులకు పైగా ఆడి 8 వేల పరుగులు సాధించాడు. ఐపీఎల్​ ప్రారంభ సీజన్​లో ఇతడిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అదే సమయంలో జట్టులో షేన్ వాట్సన్, కమ్రాన్ అక్మల్​ లాంటి విధ్వంసకర బ్యాట్స్​మెన్ ఉండటం వల్ల లాంగర్​కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఈ లీగ్​లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఇతడు రిటైర్మెంట్ ప్రకటించాడు.

స్టీవ్ స్మిత్ (ఆర్సీబీ)

ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఒకే డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారన్న విషయం తెలుసా? అవును ఇది 2010 సీజన్​లో జరిగింది. కోహ్లీ జట్టుకు ప్రధాన బ్యాట్స్​మన్​గా ఉండగా, స్మిత్​ స్పెషలిస్ట్ బౌలర్​, బ్యాట్స్​మన్​గా ఉండేవాడు. కానీ ఇతడి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసిన ఆర్సీబీ సీజన్​ మొత్తం స్మిత్​ను బెంచ్​కే పరిమితం చేసింది. కానీ అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్​లో 11 వికెట్లతో సత్తాచాటాడీ ఆసీస్ క్రికెటర్.

స్మిత్

నికోలస్ పూరన్ (ముంబయి ఇండియన్స్)

ఐపీఎల్ 2017 సీజన్​లో వెస్టిండీస్​ బ్యాట్స్​మన్ నికోలస్ పూరన్​ను జట్టులోకి తీసుకుంది ముంబయి ఇండియన్స్. ఆ సమయంలో అతడి వయసు 21 ఏళ్లు. ప్రతి సీజన్​లోనూ అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలో దిగే ముంబయి ఇప్పటికి చాలామందిని బెంచ్​కే పరిమితం చేసింది. రెండు సీజన్లుగా విధ్వంసకర ఓపెనర్ క్రిస్ లిన్ ఒకే మ్యాచ్ ఆడాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే 2017లోనూ నికోలస్ పూరన్​ను ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఆ ఏడాది కొందరిపైనే నమ్మకం ఉంచిన ముంబయి విజేతగానూ నిలిచింది. ప్రస్తుతం పూరన్​ ఐపీఎల్​లో అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా కొనసాగుతున్నాడు.

నికోలస్ పూరన్

బ్రెండన్ టేలర్ (సన్​రైజర్స్)

జింబాబ్వే జట్టులో గొప్ప ఆటగాడిగా పేరుగాంచాడు బ్రెండన్ టేలర్. కీపర్​గానూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2014లో ఇతడికి ఐపీఎల్​ అవకాశం దక్కడానికి ఇదే కారణం. సన్​రైజర్స్ జట్టు ఇతడిని కొనుగోలు చేసింది. డారెన్ సామి కెప్టెన్సీ వహించిన ఈ సీజన్​లో అంచనాలను అందుకోవడంలో విఫలమైన సన్​రైజర్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆరోన్ ఫించ్, వార్నర్​లాంటి విదేశీ బ్యాట్స్​మెన్ జట్టులో ఉండటం వల్ల మరో ఓవర్సీస్ బ్యాట్స్​మన్​కు అవకాశం లేకుండా పోయింది. అలాగే సీజన్ మొత్తం నమన్ ఓజా కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో బ్రెండన్ టేలర్​కు తుదిజట్టులో చోటు లభించలేదు.

టేలర్

జోష్ హెజిల్​వుడ్ (ముంబయి ఇండియన్స్)

ఆస్ట్రేలియాకు ప్రస్తుతం ప్రధాన బౌలర్​గా కొనసాగుతున్నాడు జోష్ హెజిల్​వుడ్. 2014 సీజన్​లో ఇతడిని ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. కానీ తుదిజట్టులో మాత్రం చోటు కల్పించలేకపోయింది. లసిత్ మలింగ లాంటి దిగ్గజ విదేశీ పేసర్ ఉండటం వల్ల మరో ఓవర్సీస్ బౌలర్​కు అవకాశం లేకుండా పోయింది. జస్ప్రీత్ బుమ్రా ఉండనే ఉన్నాడు. దీంతో ముంబయి ఇండియన్స్​కు అరంగేట్రం చేయకుండానే సీజన్​ను ముగించాడు హెజిల్​వుడ్.

హెజిల్​వుడ్

ABOUT THE AUTHOR

...view details