క్రికెట్లో గాయాలనేటివి ఎలాంటి జట్టునైనా బలహీన పరిచేలా చేస్తాయి. టీమ్ఇండియా కూడా గత కొద్ది కాలంగా ఈ గాయాల రుచి చూస్తూనే వస్తోంది. ముఖ్యంగా పేస్ బౌలర్లు తరచూ గాయాల వల్ల కీలకమైన సిరీస్‌లకు దూరమౌతున్నారు. ఈ క్రమంలో దీపక్ చాహర్ తరచూ టీమ్‌లోకి వస్తూ.. వెనువెంటనే గాయాల బారినపడుతున్నాడు. తాజాగా ఈ విషయంపై మాజీ కోచ్ రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న దీపక్.. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో బుధవారం జరగనున్న రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు దూరం కానున్నాడని సమాచారం. ఈ గాయాలపై మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా మండిపడ్డాడు. చెన్నై టీమ్‌లో ఇప్పటికే కైల్ జేమీసన్, ముకేశ్ చౌదరి లాంటి స్టార్స్ గాయాలతోనే మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఇదే తరహాలో చాహర్ కూడా చెన్నై టీమ్‌కు అందుబాటు లేకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. దీపక్ చాహర్ తరచూ గాయాల పాలవ్వడం పట్ల శాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా కొందరు క్రికెటర్లు నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ)కు శాశ్వత సభ్యులు అయిపోయారంటూ రవిశాస్త్రి సెటైర్లు వేశాడు. "కొందరు ప్లేయర్స్ ఎన్సీఏలో శాశ్వత సభ్యులు అవుతున్నారు. త్వరలోనే వారికి అక్కడ నివాస అనుమతి కూడా వస్తుందేమో" అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు.