ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై వేదికగా శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. వరుసగా మూడు పరాజయాలతో పంజాబ్ ఉండగా.. టోర్నీలో నిలకడ కోసం ముంబయి ఇండియన్స్ ప్రయత్నిస్తుంది. ఇప్పటివరకు టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన రెండు విజయాలను నమోదు చేసుకుంది. పంజాబ్.. ఒకే గెలుపుతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరుకుంది.
మిడిల్ ఆర్డర్‌పై దృష్టి..
దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమై పరాజయాన్ని చవిచూసింది ముంబయి ఇండియన్స్. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నా.. మిడిల్ ఆర్డర్లో నిలకడ లేకపోవడం వల్ల జట్టు అతితక్కువ స్కోరుకే పరిమితమవుతోంది. అయితే పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రదర్శన చేయాలని రోహిత్‌సేన వ్యూహాలను రచిస్తోంది. అలాగే, ముంబయి బౌలింగ్ దళం బలంగానే ఉంది.
హాట్రిక్ ఓటముల తర్వాత..
బుధవారం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది పంజాబ్. అయితే ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఓటమికి కారణం.. చెపాక్ పిచ్‌ను అర్థం చేసుకోవడమేనని పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటి సమస్యలను అధిగమిస్తామని స్పష్టం చేశాడు.