IPL media rights auction 2022: భారత క్రికెట్ నియంత్రణ మండలికి కల్పతరువుగా మారిన ఐపీఎల్.. బోర్డు ఖజానాను మరోసారి భారీగా నింపేందుకు సిద్ధమైంది. 2023-27 ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల కోసం ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ-వేలం ప్రారంభం కాగా, అంతా అంచనా వేసినట్లుగానే భారీ స్పందన వ్యక్తమైంది. ప్రసార హక్కుల ధర 45వేల కోట్ల రూపాయలు పలుకుతుందని బీసీసీఐ లెక్కలు కట్టగా, తొలిరోజే ఇది 42వేల కోట్ల రూపాయలకు చేరింది. వేలంకు బీసీసీఐ కనీస ధరను 32వేల 440 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా, తొలి రోజే దాని ధర అంతకు 10వేల కోట్ల రూపాయలకు చేరింది. వేలం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండగా, ఈ విలువ మరింత పెరుగుతుందని అంచనా. 2017లో స్టార్ ఇండియా 2018-2022 సీజన్ కోసం టీవీ, డిజిటల్ ప్రసారాలకు కలిపి 16 వేల 347 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటికీ అదే సరికొత్త రికార్డు కాగా, ఈ సారి అంతకు సుమారు మూడు రెట్లు ఎక్కువ సొమ్ము బీసీసీఐ ఖజానాలో చేరే అవకాశం ఉంది.
2023-27 ఐపీఎల్ టీవీ, డిజిటల్ మాధ్యమాల్లో ప్రసారాల హక్కుల కోసం డిస్నీ స్టార్, రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, సోనీ, జీ లాంటి దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ రేసు నుంచి అమెజాన్ వైదొలిగినా, టీవీ, స్ట్రీమింగ్ పరంగా చూసుకుంటే 10 సంస్థలు హక్కుల కోసం బరిలో నిలిచాయి. టీ-ట్వంటీ లీగ్ మీడియా హక్కుల కోసం బీసీసీఐ తొలిసారి ఈ- వేలం నిర్వహిస్తోంది. ఈ వేలానికి ప్రత్యేకంగా ముగింపు తేదీని ప్రకటించలేదు. అయితే సోమవారం లేదా మంగళవారం ఇది ముగిసే అవకాశం ఉంది. మిగతా సంస్థలన్నీ వైదొలిగి, అత్యధిక బిడ్ దాఖలయ్యే వరకూ ఈ వేలం కొనసాగుతుంది. ఆన్‌లైన్ పోర్టల్‌లో సంస్థలు తమ బిడ్లు దాఖలు చేస్తాయి. ఒక్కొక్క సంస్థ వేలం నుంచి వైదొలుగుతూ చివరకు ఒక్కటి మాత్రమే మిగిలేంత వరకూ వేలం జరుగుతుంది. చివరకు అత్యధిక బిడ్ దాఖలు చేసిన సంస్థ పేరును ప్రకటిస్తారు.