ఐపీఎల్-14 సీజన్(IPL 2021 Final) తుది పోరుకు వేళైంది. పేలవ ప్రదర్శనతో గతేడాది లీగ్ దశలోనే నిష్క్రమించిన చెన్నై.. రెట్టించిన వేగంతో ఈ సీజన్‌లో ఫైనల్‌కు(CSK Vs KKR) దూసుకెళ్లింది. ఆటగాళ్ల సమష్టి కృషితో రెండో అంచెలో వరుస విజయాలు సాధించిన కోల్‌కతా నాకౌట్‌లో ఆర్సీబీ, దిల్లీని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో లీగ్‌దశలో ఆడిన 14 మ్యాచుల్లో 9 గెలిచి చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో.. టేబుల్ టాప్ దిల్లీని ఓడించి ఐపీఎల్‌లో తొమ్మిదోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ధోనీ వ్యూహాలు ఆ జట్టుకు ప్రధాన బలం. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లో చెలరేగి ఆడుతున్నాడు. ఈ ఏడాది 600 పైచీలుకు పరుగులు చేసి. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ధోనీ మాయ చేస్తాడా?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు(Chennai Super Kings IPL Wins) కూర్పు విషయంలో.. కెప్టెన్ ధోనీ వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా స్థానంలో.. ఉతప్పను తొలి క్వాలిఫయర్ తుదిజట్టులోకి తీసుకుని ధోనీ ఫలితం రాబట్టాడు. బ్రావో, డుప్లెసిస్, రాయుడు, ఉతప్ప, మొయిన్ అలీ, జడేజా వంటి సీనియర్ల అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని యాజమాన్యం భావిస్తోంది. జోష్ హెజిల్‌వుడ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లతో కూడిన బౌలింగ్ దళం కూడా బలంగా కనిపిస్తోంది. ఐతే.. కోల్‌కతా స్పిన్ త్రయం వరుణ్ చక్రవర్తి, షకిబ్, సునీల్ నరైన్‌ను ఎలా ఎదుర్కొంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.