IPL final 2022: ఈసారి టీ20 లీగ్‌లో విజేతగా నిలిచే జట్టేది అని టోర్నీ ఆరంభానికి ముందు అడిగితే.. అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబయి అనో.. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై అనో.. గత కొన్ని సీజన్ల నుంచి చక్కటి ప్రదర్శన చేస్తున్న దిల్లీ క్యాపిటల్స్ అనో.. కాదంటే కాగితం మీద బలంగా కనిపిస్తున్న కోల్‌కతా, బెంగళూరు జట్ల పేర్లో చెప్పి ఉంటారు ఎక్కువమంది! తొలి సీజన్లో టైటిల్ గెలిచాక ఎప్పుడూ ఫైనల్‌కే రాని రాజస్థాన్, కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్‌లో ఒక జట్టు కప్పు గెలుస్తుందని, ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరుగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరేమో! కానీ ఇప్పుడు ఈ రెండు జట్లే కప్పు కోసం కొట్లాడబోతున్నాయి. మరి తొలి సీజన్లోనే గుజరాత్ కప్పుతో బోణీ కొట్టేస్తుందా? లేక రాజస్థాన్ రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా?
రెండు కొత్త జట్ల రాకతో సుదీర్ఘంగా సాగిన లీగ్ దశ తర్వాత, రసవత్తర ప్లేఆఫ్స్ మ్యాచ్‌లతో అలరించిన టీ20 లీగ్ 15వ సీజన్ పతాక పోరు ఆదివారమే. లీగ్‌లోకి అడుగు పెట్టిన తొలి సీజన్లోనే అద్భుత ప్రదర్శనతో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి, తొలి క్వాలిఫయర్లోనూ సునాయాసంగా నెగ్గి ఫైనల్ చేరింది గుజరాత్. చాలా ఏళ్ల తర్వాత నిలకడగా ఆడి రెండో స్థానంతో లీగ్ ముగించి, తొలి క్వాలిఫయర్లో ఓడినా, రెండో క్వాలిఫయర్లో అలవోకగా నెగ్గి తుది సమరానికి అర్హత సాధించింది రాజస్థాన్. వీటి మధ్యే తుది సమరం. ఈ సీజన్లో ఏ జట్టుకూ సాధ్యం కాని నిలకడకు తోడు.. ఆడిన రెండుసార్లూ రాజస్థాన్‌ను ఓడించడం గుజరాత్‌ను ఫేవరెట్‌గా నిలిపేదే. కానీ భీకర బ్యాట్స్‌మెన్, నాణ్యమైన బౌలర్లు ఉన్న రాజస్థాన్‌ను తక్కువగా అంచనా వేస్తే కష్టమే. ఫైనల్ హోరాహోరీగానే సాగే అవకాశముంది.
ముంచినా.. తేల్చినా అతనే..: రాజస్థాన్ విజయావకాశాలు బట్లర్ మీదే ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ సీజన్లో రాజస్థాన్ ఇక్కడిదాకా రావడానికి అతనే కారణం. లీగ్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ అంతా ఒకవైపు, బట్లర్ ఒకవైపు అన్నట్లే సాగింది ఇప్పటిదాకా. 824 పరుగులు.. 4 శతకాలు.. ఈ గణాంకాలే చెప్పేస్తాయి బట్లర్ ఎలా చెలరేగిపోతున్నాడో. లీగ్ దశ చివర్లో కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమై ఆందోళన రేకెత్తించిన అతను.. ప్లేఆఫ్స్‌లోకి వచ్చాక మళ్లీ జోరందుకున్నాడు. తొలి క్వాలిఫయర్లో 89 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు బట్లర్. కానీ బౌలర్ల వైఫల్యంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. రెండో క్వాలిఫయర్లో మొదట బౌలర్లు అదరగొడితే.. తర్వాత బట్లర్ సెంచరీతో మిగతా పని పూర్తి చేశాడు. కాబట్టి ఫైనల్లో బట్లర్ ఆటను బట్టే రాజస్థాన్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. రషీద్‌పై పేలవ రికార్డున్న బట్లర్.. ఫైనల్లో అతణ్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
"2008లో రాజస్థాన్ టైటిల్ గెలిచిన రోజు నేను పగలు కేరళలో అండర్-16 మ్యాచ్‌లో ఆడుతున్నా. రాత్రి నా స్నేహితులతో కలిసి మ్యాచ్ చూశాను. చివరి పరుగును షేన్ వార్న్ పూర్తి చేయడం నాకింకా గుర్తుంది. ఇప్పుడు రాజస్థాన్ మళ్లీ ఫైనల్ ఆడబోతోంది. వార్న్ కోసం మేం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి ఇంకొక్క అడుగు దూరంలో ఉన్నాం. అతడి కోసం కప్పు గెలుస్తాం."
- సంజు శాంసన్, రాజస్థాన్ కెప్టెన్
అటు స్టార్ పవర్.. ఇటు సమష్టి బలం:ఫైనల్ చేరిన రెండు జట్లను పోల్చి చూస్తే.. ఒక ముఖ్యమైన తేడా కనిపిస్తుంది. రాజస్థాన్ జట్టులో బాగా పేరుమోసిన ఆటగాళ్లున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో భారీ హిట్టర్లు ఆ జట్టు సొంతం. బట్లర్, సంజు శాంసన్, హెట్‌మయర్‌లకు తోడు.. యశస్వి, పడిక్కల్ లాంటి యువ ప్రతిభావంతులతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వీరిలో ఇద్దరు ముగ్గురు నిలబడితే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో బౌల్ట్, చాహల్, అశ్విన్ లాంటి అంతర్జాతీయ స్టార్ల అండ ఆ జట్టుకుంది. మెకాయ్, ప్రసిద్ధ్ సైతం కొన్ని మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన చేశారు. రెండో క్వాలిఫయర్లో ఈ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రధాన బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. రాజస్థాన్‌కు తిరుగుండదు. ఇక గుజరాత్ విషయానికి వస్తే.. టోర్నీలో ఆ జట్టంతా సమష్టిగా ఆడిన జట్టు మరొకటి కనిపించదు. అంచనాల్లేకుండా, ఆలస్యంగా జట్టులోకి వచ్చిన సాహా మంచి ఆరంభాలతో జట్టుకు పెద్ద బలంగా మారాడు.