IPL final 2022: ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ.. సిక్సులు, ఫోర్లు బాదుతూ బ్యాట్స్‌మెన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. స్పిన్, పేస్‌లతో బౌలర్ల ఎదురుదాడి. ఐపీఎల్ వచ్చిందంటే చాలు ఇవన్నీ చూస్తూ క్రికెట్ అభిమానులకు ఫుల్‌మీల్స్ తిన్నట్టు ఉంటుంది. పొట్టి క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఐపీఎల్.. ప్రతిసీజకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
- ఈ ఏడాది ఐపీఎల్లో ఏకంగా 10 జట్లు బరిలోకి దిగాయి. దీంతో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. కొత్త జట్లే కదా అని అనుకున్న లఖ్‌నవూ సూపర్జయంట్స్, గుజరాత్ టైటాన్స్.. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టించాయి. బడా జట్లపైన కూడా ఆధిపత్యం ప్రదర్శించాయి.
- గుజరాత్, లఖ్‌నవూ జట్లు టాప్-4లో నిలవడం ఒక ఎత్తు అయితే.. గత కొన్ని సీజన్లుగా తడబడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఫామ్‌లోకి వచ్చి మంచి ప్రదర్శన చేయడం మరో ట్విస్ట్. బట్లర్ భీకర ఫామ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రీజులోకి రావడమే ఆలస్యం బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.
- 2017 తర్వాత ముంబయి లేదా చెన్నై జట్లు లేకుండా ఫైనల్ జరగడం ఇదే తొలిసారి.
- ఈ నేపథ్యంలో గుజరాత్, రాజస్థాన్ జట్లు ఫైనల్లో ఎలా తలపడతాయోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు.. ఐపీఎల్ ముగింపు ఏర్పాట్లు తెలిస్తే ఈ ఆసక్తి మరోస్థాయికి వెళ్తుంది. కొవిడ్ కారణంగా గత ఐపీఎల్ ఆంక్షల మధ్య సాగింది. కానీ ఈసారి అభిమానుల కోలాహం మధ్య మ్యాచ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అట్టహాసంగా ముగింపు వేడుకలను జరపాలని నిర్వహకులు ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
హార్దిక్‌కు లక్ కలిసి వస్తుందా?-- గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య ఈ సీజన్ అద్భుతంగా రాణించాడు. అయితే నెట్టింట ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. హార్దిక్ ఇప్పుటివరకు ఆడిన ఏ ఫైనల్లో కూడా ఓడిపోలేదని చెప్పుకుంటున్నారు. 2015లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన పాండ్య.. ముంబయి ఇండియన్స్ తరఫున నాలుగు ఫైనల్స్ ఆడాడు. ఈ నాలుగు మ్యాచుల్లోనూ ముంబయి విన్నర్‌గా నిలిచింది. మరి ఇప్పుడు గుజరాత్ కెప్టెన్‌గా హార్దిక్‌కు ఈ లక్ కలిసివస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ ఫైనల్లో విజయం సాధిస్తే.. అత్యంత వేగంగా ఐపీఎల్ టైటిల్ సాధించిన పూర్తిస్థాయి కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు సృష్టిస్తాడు.
రాజస్థాన్ రాజసం ఉంటుందా?-- తొలి సీజన్ తర్వాత మళ్లీ ఫైనల్లోకి అడుగుపెట్టే అవకాశం దక్కించుకోని రాజస్థాన్ రాయల్స్‌కు.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత టైటిక్ కొట్టే అవకాశం వచ్చింది. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌తో మెప్పిస్తున్న ఈ జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు దక్కించుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉంది. తొలి సీజన్లో కప్పు అందించిన కెప్టెన్ షేన్‌వార్న్‌కు నివాళిగా ఈ టైటిల్ కొట్టాలని సంజూశాంసన్ సేన భావిస్తోంది.