Virat Kohli vs Gautam Gambhir : ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సోమవారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, లఖ్‌నవూ జట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బెన్ స్టోక్స్ అనే ఉచ్ఛారణ కలిగిన ఓ బూతు పదాన్ని పరస్పరం తిట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, దీనిపై భిన్నాభ్రిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది దీన్ని చిన్న పిల్లల చేష్టలుగా కొట్టిపారేస్తున్నారు. మరికొందరు వారి ఇద్దరి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదాన్ని ఓ మసాలా సీన్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జెంటిల్మెన్ గేమ్‌ను విశ్వసించే, ప్రేమించే వారు.. క్రికెట్లో ఇలాంటివి జరగకుడదని భావిస్తున్నారు.
ఆ రాత్రి ఏం జరిగింది?
సోమవారం జరిగిన ఘటన గురించి మరిన్ని వివరాలు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. "మ్యాచ్ ముగిశాక లఖ్‌నవూ ప్లేయర్ మేయర్స్, విరాట్ కోహ్లీ నడుచుకుంటూ కొన్ని మీటర్ల దూరం వెళ్లడం మీరు టీవీలో చూశారు. ఆ సమయంలో.. ఎందుకు నిరంతరం దుర్భాషలాడుతున్నావు? అని మేయర్స్.. కోహ్లీని ప్రశ్నించాడు. దీంతో నువ్వు ఎందుకు నా వైపు చూస్తున్నావు? అని కోహ్లీ సమాధానమిచ్చాడు. పరిస్థితి చేజారుతుందని గమనించిన గౌతమ్ గంభీర్.. మేయర్స్‌ను పక్కకు నెట్టి.. విరాట్‌తో సంభాషణ చేయద్దని అన్నాడు. మిగతా ప్లేయర్లు పక్కకు తీసుకెళ్లే ముందు ఇద్దరి మధ్య ఈ వాగ్వాగం జరిగింది. అంతకుముందు, విరాట్.. నవీన్ ఉల్ హక్‌ను దుర్భాషలాడుతున్నాడని అమిత్ మిశ్ర అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు" అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.