ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బోణీ కొట్టింది. వరుసగా తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాలను అందుకున్న సన్‌రైజర్స్ మూడో మ్యాచుతో ఈ సీజన్లో ఖాతా తెరిచింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో.. రెండిటిలో అద్భుత ప్రదర్శన చేసి పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించిది. సొంతగడ్డపై ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే (4/15) స్పిన్ మాయాజాలం, రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్; 48 బంతుల్లో 10×4, 3×6) ధానధన్ ఇన్నింగ్స్ వల్ల సన్‌రైజర్స్‌కు తొలి విజయం దక్కింది. శిఖర్ ధావన్ (99 నాటౌట్; 66 బంతుల్లో 12×4, 5×6) విరోచిత పోరాటం చేసినా వృథా అయింది.
మొదట టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లనష్టానికి 143 పరుగులు చేసింది. మార్కండేకు తోడు ఉమ్రాన్ మాలిక్ (2/32), మార్కో జాన్సెన్ (2/16) పంజాబ్‌ను బాగా కట్టిడి చేశారు. వరుసగా వికెట్లను పడగొట్టారు. దీంతో పంజాబ్ 90 స్కోరు కూడా చేయడం కష్టమనుకున్నారు. కానీ కెప్టెన్ శిఖర్ ధావన్(99*; 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) మాత్రం మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడుతూనే ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. కానీ ఒక్క పరుగు తేడాతో శతకం మిస్ చేసుకున్నాడు. సన్‌రైజర్స్ భువనేశ్వర్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు.