IPL 2023 : ఐపీఎల్ 16 సీజన్లో భాగంగా హోమ్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్ పూర్తైంది. సన్‌రైజర్స్ బౌలర్లు విజృంభించారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(99*; 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. ఒక్క పరుగు తేడాతో శతకం మిస్ చేసుకున్నాడు. సామ్ కరన్ (22) ఫర్వాలేదనిపించగా.. మిగతా ప్లేయర్లందరూ పేలవ ప్రదర్శన చేశారు. హైదరాబాద్ బౌలర్ల ధాటికి 88 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది పంజాబ్. శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. గౌరవప్రదమైన స్కోరు అందించాడు. బౌలింగ్ విషయానికొస్తే.. మయాంక్ మార్కండే చెలరేగి.. 4 వికెట్లు పడగొట్టాడు. జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ ఒక వికెట్ తీశాడు.
4-15-4.. మార్కండే మాయాజాలం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ మయాంక్ మార్కండే అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లు సంధించి.. నాలుగు వికెట్లు తీశాడు. అంతే కాకుండా కేవలం 15 మాత్రమే ఇచ్చాడు. మొదట పేసర్ అయిన ఈ యువ బౌలర్.. తన కోచ్ ప్రోత్సాహంతో లెగ్ స్పిన్నర్‌గా మారాడు. 2018లో ముంబయి ఇండియన్స్ దరఫున దేశీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. దిగ్గజ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ వికెట్ తీశాడు. అదే మార్కండేకు మొదటి వికెట్. ఆ తర్వాత దిల్లీ, రాజస్థాన్ జట్లకు ఆడాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొనసాగుతున్నాడు.