తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 SRH VS MI : సొంతగడ్డపై సన్​రైజర్స్​కు నిరాశ.. ముంబయి హ్యాట్రిక్​ విజయం

ఉప్పల్​ వేదికపై ముంబయి ఇండియన్స్‌ మురిసింది. ఛాంపియన్‌ ఆటతీరుతో హ్యాట్రిక్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో ఇలా అన్నింటిలోనూ సత్తా చాటి.. ఈ సీజన్​లో వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. ముంబయి లాగే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి, ఆ తర్వాత పుంజుకుని హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన సన్‌రైజర్స్‌కు ఈ సారి బ్రేక్‌ పడింది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై మూడు మ్యాచ్​లు ఆడిన సన్‌రైజర్స్‌.. రెండో ఓటమితో అభిమానులను నిరాశపరిచింది.

IPL 2023 Sunrisers Hyderabad VS Mumbai Indians Match Result
IPL 2023 Sunrisers Hyderabad VS Mumbai Indians Match Result

By

Published : Apr 18, 2023, 11:01 PM IST

Updated : Apr 19, 2023, 6:48 AM IST

ఐపీఎల్‌ సీజన్​ను రెండు ఓటములతో మొదలుపెట్టిన రోహిత్​ సేన.. ఇప్పుడు వరుసగా మూడో విజయంతో అదరగొట్టింది. ఉప్పల్​ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్​తో ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కామెరూన్‌ గ్రీన్‌(64) ఊచకోతతో ముంబయి ఇండియన్స్​ టీమ్​ 14 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. దీంతో సొంతగడ్డపై సనరైజర్స్​కు నిరాశే మిగిలింది.

నిర్ణీత ఓవర్లలో ముంబయి టీమ్​ 5 వికెట్లకు 192 పరుగులు సాధించింది. ముంబయికి ఆడుతున్న హైదరాబాదీ కుర్రాడు తిలక్‌ వర్మ (37) స్కోర్​ చేసి సొంతగడ్డపై సత్తా చాటాడు. రోహిత్ శర్మ (28) కూడా మైదానంలో దూకుడుగా ఆడారు. ఇషాన్ కిషన్ (38); టిమ్ డేవిడ్ (16) పరుగులు చేయగా.. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సన్ రెండు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

193 పరుగుల భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్​రైజర్స్​కు ఈ సారి గట్టి దెబ్బ తగిలింది. అయినప్పటికీ గత మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన హ్యారీ బ్రూక్‌ ఉండటం వల్ల సన్‌రైజర్స్‌ ధీమాగానే కనిపించింది. కానీ అతను 9 పరుగులే చేసి బెరెన్‌డార్ఫ్‌ బౌలింగ్‌లో వెనుదిరగడం వల్ల ఛేదనలో సన్‌రైజర్స్‌ ఓటమిపాలయ్యింది. రాహుల్‌ త్రిపాఠి (7)ని సైతం బెరెన్‌డార్ఫ్‌ ఎక్కువ సేపు మైదానంలో ఉండనివ్వలేదు. బెరెన్‌డార్ఫ్‌తో కలిసి కొత్త బంతిని పంచుకున్న అర్జున్‌ తెందుల్కర్‌ కట్టుదిట్టంగా బంతులేసి ఆకట్టుకున్నాడు.

ఇక 25/2తో కష్టాల్లో ఉన్న సన్‌రైజర్స్‌ టీమ్​కు మయాంక్‌ అగర్వాల్‌, మార్‌క్రమ్‌ అండగా నిలిచారు. ఈ సీజన్‌లో తొలిసారి మయాంక్‌ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తూ కనిపించాడు. మార్‌క్రమ్​తో అతను 46 పరుగులు జోడించడం వల్ల హైదరాబాద్‌ కోలుకున్నట్లే కనిపించింది. కానీ మార్‌క్రమ్‌, అభిషేక్‌శర్మ (1) ఒక్క పరుగు వ్యవధిలో ఔటవడంతో సన్‌రైజర్స్‌ 72/4తో మరోసారి చిక్కుల్లో పడింది.

ఈ స్థితిలో అగర్వాల్‌కు క్లాసెన్‌ జత కలవడంతో మళ్లీ హైదరాబాద్‌లో ఆశలు కలిగాయి. ఇద్దరూ ముంబయి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. క్లాసెన్‌.. పియూష్‌ చావ్లా వేసిన 14వ ఓవర్లో రెండేసి బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. దీంతో సమీకరణం 37 బంతుల్లో 66 పరుగులతో కాస్త అందుబాటులోకి వచ్చింది.

కానీ చావ్లా చివరి బంతికి కూడా భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా.. క్లాసెన్‌ లాంగాన్‌లో డేవిడ్‌ చేతికి చిక్కాడు. దీంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఆ తర్వాతి ఓవర్లో మెరిడిత్‌.. అగర్వాల్‌ ఆట కట్టించడంతో సన్‌రైజర్స్‌ పనైపోయింది. జాన్సన్‌ (13), అబ్దుల్‌ సమద్‌ (9), సుందర్‌ (10)ల పోరాటం సరిపోలేదు. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి రాగా.. అర్జున్‌ 5 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్‌ ముంబయి సొంతమైంది.

ఇదీ చూడండి:IPL హిస్టరీలో నాలుగో ప్లేయర్​గా రోహిత్​ రికార్డ్​.. బుంగమూతి పెట్టిన రితికా

Last Updated : Apr 19, 2023, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details