ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస అపజయాలను మూటగట్టుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. తీవ్ర గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ బాధాకరమైన విషయాన్ని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ట్విట్టర్ వేదికగా గురువారం ప్రకటించింది. తొడ కండరాల గాయంతో భాదపడుతున్న సుందర్.. ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడని ట్వీట్లో పేర్కొంది. అంతే కాకుండా అతను త్వరగా కోలుకోవాలని ఫ్రాంచైజీ ఆశిస్తున్నట్లు తెలిపింది.
ఐపీఎల్ వేలంలో వాషింగ్టన్ సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. తొలి 6 మ్యాచుల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయని సుందర్.. దిల్లీతో జరిగన మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. ఇటీవల దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు. ఒకే ఓవర్‌లో మూడు కీలక వికెట్లను పడగొట్టి ఔరా అనిపించాడు.
8 ఓవర్ రెండో బంతికి వార్నర్‌ను, నాలుగో బంతికి సర్ఫరాజ్ ఖాన్‌ను, చివరి బంతికి అమాన్ ఖాన్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. కాగా ఈ ముగ్గురూ క్యాచ్ ఔట్ కావడం గమనార్హం. తన బౌలింగ్ స్కిల్స్‌తో మూడు వికెట్లు పడగొట్టిన సుందర్.. బ్యాటింగ్‌లోనూ ఇరగదీశాడు. దీంతో ఆ మ్యాచ్‌లో దిల్లీ ప్లేయర్లకు చుక్కలు చూపించాడు.