ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఆయా సీజన్లలో బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు ఆడే కీలక మ్యాచ్‌లు అన్నీ ఆరెంజ్ ఆర్మీ జయాపజయాలతో ముడి పడి ఉంటాయి. ఈ క్రమంలో గురువారం(మే 18) నాటి మ్యాచ్ కూడా అలాంటిదే. బెంగళూరు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకు వేయాలనుకుంటుంది. మరి హైదరాబాద్ ఆర్సీబీకి ఆ ఛాన్స్ ఇస్తుందా.. లేదా ఎప్పటిలాగే వారి ఆనవాయితీని కొనసాగిస్తూ బెంగళూరుకు మరోసారి నిరాశే మిగుల్చుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటికే 22 సార్లు తలపచగా.. 12 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలుపొందింది. 9 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ నెగ్గింది. ఒక దాంట్లో ఫలితం తేలలేదు.
2009 ఫైనల్స్‌లో ఢీ:
ఐపీఎల్ ప్రారంభమైన రెండో సీజన్ నుంచే హైదరాబాద్(అప్పటి పేరు, డెక్కన్ ఛార్జర్స్ ), బెంగళూరు జట్ల మధ్య పోరు ప్రత్యేకంగా మారింది. 2009 ఐపీఎల్ ఫైనల్స్‌లో బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ ఛార్జర్స్ 143 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీని 137కే కట్టడి చేసి టైటిల్ ఎగిరేసుకుపోయింది.
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు 2009 ఫైనల్ 2012 లీగ్ దశలోనే:
ఈ సీజన్లో డెక్కన్ ఛార్జర్స్ తన ఆఖరి మ్యాచ్ బెంగళూరుతో ఆడింది. అప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన డెక్కన్.. బెంగళూరుకు కీలకమైన ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ ఓటమితో ఆర్సీబీ, చెన్నైతో కలిసి 17 పాయింట్లతో సమానంగా ఉన్నా.. నెట్‌రన్‌రేట్ మైనస్‌లో ఉన్నందున బెంగళూరు కూడా హైదరాబాద్‌తో కలిసి ఇంటి బాట పట్టింది. కాగా ఆ సీజన్లో కోల్‌కతా ఛాంపియన్‌గా నిలిచింది.
2013లో మరోసారి:
హైదరాబాద్ ఫ్రాంఛైజీ మారింది ఆ సీజన్లోనే. డెక్కన్ ఛార్జర్స్ పేరు కాస్తా 'సన్ రైజర్స్' గా మారింది. ఆ సీజన్ సన్‌రైజర్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడింది. ఆ మ్యాచ్‌లో సన్ రైజర్స్ గెలిచి ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓడి ఉంటే.. బెంగళూరు నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌లో బెర్తు కన్ఫార్మ్ చేసుకునేది.
2015లో ఓటమి చూపిన ప్రభావం:
ఐపీఎల్ సీజన్ 8లో టాప్ 2 ప్లేస్ కోసం ముంబయి, బెంగళూరు జట్ల మధ్య టాప్ తీవ్ర పోటీ నెలకొంది. అప్పటివరకూ హైదరాబాద్ తన చివరి మ్యాచ్‌ల్లో గెలిచి బెంగళూరును నష్టపరిస్తే.. ఆ సీజన్లో లీగ్ ఆఖరి మ్యాచ్‌లో ముంబయి పై ఓడి, ఆర్సీబీ జట్టును మూడో స్థానానికి పరిమితం చేసింది. అలా బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గినా.. క్వాలిఫైర్ 2లో చెన్నైతో ఓడి ఇంటి ముఖం పట్టింది.
2016 ఫైనల్స్‌లో:
సుమారు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఆర్సీబీ ఫైనల్స్ చేరింది. ఆ సీజన్లో భీకరమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ, యూనివర్సెల్ బాస్ గేల్, మిస్టర్ 360 డివిల్లీర్స్‌తో పటిష్ఠంగా ఉన్న ఆర్సీబీదే టైటిల్ అని అనుకున్నారంతా. కానీ మొదటగా బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. స్కోర్ బోర్డుపై 200 పై చిలుకు లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో గాడీ తప్పిన ఆర్సీబీ ఫైనల్స్‌లో మరోసారి హైదరాబాద్ చేతిలో భంగపడింది. బెంగళూరు టైటిల్ కల.. కలలాగే మిగిలిపోయింది.
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు 2016 ఫైనల్ 2020లో ఎలిమినేటర్ పోరులో:
2020 వ సంవత్సరంలో ఇరు జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ జట్లు ఎలిమినేటర్‌లో ఢీ కొన్నాయి. ఈసారైనా హైదరాబాద్‌ను దెబ్బకొట్టాలని బెంగళూరు ఆశించినప్పటికీ... మరోసారి భంగపడింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్.. కీలక మ్యాచ్‌ల్లో బెంగళూరును ఆరోసారి దెబ్బకొట్టింది.
2022లో 68కే ఆలౌట్:
గత సీజన్లో లీగ్ దశలో ఆర్సీబీ, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్ లైనప్‌ను సన్‌రైజర్స్ తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఆర్సీబీని 68 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా బెంగళూరు ఐపీఎల్లో తమ రెండో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. విశ్వరూపం ప్రదర్శించిన నటరాజన్ ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు నేలకూల్చాడు.
మరి ఇప్పుడేం జరుగుతుందో:
ఈ సీజన్ ఐపీఎల్లో జట్లను గ్రూపులుగా విభజించిన కారణంగా ఆర్సీబీ, సన్‌రైజర్స్‌తో ఒకే మ్యాచ్ ఆడనుంది. అయితే 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 5 స్థానంలోఉన్న ఆర్సీబీకి ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకు వేయాలనుకుంటుంది. మరి హైదరాబాద్ ఆర్సీబీకి ఆ ఛాన్స్ ఇస్తుందా.. లేదా ఎప్పటిలాగే వారి ఆనవాయితీని కొనసాగిస్తూ బెంగళూరుకు మరోసారి నిరాశే మిగుల్చుతుందా అని వేచి చూడాలి. ఈ మ్యాచ్ ఫలితం ముంబయికి కూడా కీలకమే.