IPL 2023 RR VS SRH : రాజస్థాన్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా అద్భుతాలు జరిగాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 215 పరుగుల భారీ లక్ష్య ఛేదన చేసిన సన్‌రైజర్స్ జట్టు.. ఆఖరికి విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. అయితే ఎంతో ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. మొదటి నుంచి సన్‌రైజర్స్ దూకుడుగా ఆడినప్పటికీ ఇంకా కావాల్సిన రన్ రేట్ ఎక్కువైపోతుండటం వల్ల ఆ జట్టు గెలుపుపై ఎవరికీ ఆశలు లేవు. సరిగ్గా ఇదే సమాయనాకి బ్రూక్‌ను పక్కన పెట్టిన ఆరెంజ్ టీమ్.. ఫిలిప్స్‌ను బరిలోకి దింపింది. అలా 12 బంతుల్లో 41 రన్స్ కావాల్సిన దశలో 26 ఏళ్ల గ్లెన్ ఫిలిప్స్ క్రీజులోకి వచ్చాడు. రాజస్థాన్ పేసర్ కుల్దీప్ను లక్ష్యంగా చేసుకున్న ఈ యంగ్ ప్లేయర్.. 19వ ఓవర్లో వరుసగా 6,6,6,4 బాది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అలా తన అద్భుత ప్రదర్శనతో హైదరాబాదీల గుండెల్లో నిలిచిపోయాడు. 'బంగారు హుండీని చిల్లర వేయడానికి వాడినట్లు'... ఇన్ని రోజులు ఇలాంటి ఫినిషర్‌ని జట్టులో ఉంచుకుని బెంచ్‌కే పరిమితం చేసినందుకు మేనేజ్మెంట్పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సన్‌రైజర్స్ ఫ్యాన్స్.
ఇన్నాళ్లూ ఎక్కడున్నావ్ ఫిలిప్స్..
Glenn Phillips IPL : తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో హైదరాబాద్‌కు చారిత్రక విజయాన్ని అందిచిన ఫిలిప్స్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు సన్‌రైజర్స్ అభిమానులు. 'ఇన్నాళ్లూ ఎక్కడున్నావయ్యా'.. 'మొదటి నుంచే ఫిలిప్స్‌ను తుది జట్టులోకి తీసుకుని ఉంటే హైదరాబాద్ ఇప్పటికి టాప్ పొజిషన్లో ఉండేది' అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు దంచేస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ ఆట తీరు ఏమాత్రం బాగాలేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచే ఈ జట్టును పరాజయాలు పలకరిస్తున్నాయి.
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తూ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాలకే పరిమితమైంది. 13 కోట్లు వెచ్చించి ఏరి కోరి ఎంచుకున్న బ్రూక్ కేవలం ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్‌లో మురిపించాడు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకున్నా.. అతన్ని జట్టులో కొనసాగించారు. అయితే బ్రూక్ కోసం ఇన్ని రోజులు ఫిలిప్స్‌ను పక్కన పెట్టారు. మరోవైపు సన్‌రైజర్స్‌కు దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గినా ఫ్లే ఆఫ్స్ చేరటం కష్టమే అని అనిపిస్తోందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
మ్యాచ్ జరిగిందిలా..
Glenn Phillips SRH :ఆదివారం రాజస్థాన్‌తో జరిగన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చారిత్రక విక్టరీని నమోదు చేసింది. వాస్తవంగా మొదటి నుంచి దూకుడుగా ఆడినా ఇంకా కావాల్సిన రన్ రేట్ ఎక్కువైపోతుండటం వల్ల రైజర్స్ గెలుపుపై ఎవరికీ ఆశలు లేవు. జట్టులో నిలకడగా రాణించే ఆటగాళ్లు కరవై పోయారు. హిట్టర్లు క్లాసెన్, కెప్టెన్ మర్క్రమ్ కూడా పెవీలియన్ చేరారు. 12 బంతుల్లో 41 రన్స్ కావాల్సిన దశలో... రాజస్థాన్ శిబిరంలో గెలుపుపై ధీమా... సన్‌రైజర్స్ డగౌట్లో ఉన్న ఆటగాళ్ల మొహాల్లో మరో ఓటమి చవి చూడబోతున్నామన్న నిరాశ మాత్రమే ఉంది. అప్పుడు వచ్చాడు 26 ఏళ్ల న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్. క్రీజులో ఉంది కొద్ది నిమిషాలే అయినా.. ఆ కొద్ది సమయంలోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. రాజస్థాన్ పేసర్ కుల్దీప్ను లక్ష్యంగా చేసుకుని 19 ఓవర్లో రెచ్చిపోయాడు. మూడు సిక్సర్లు సహా ఓ ఫోర్ రాబట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆశల్లేని స్థితి నుంచి విజయం అంచుల దాకా తీసుకొచ్చి ఔట్ అయ్యాడు.
RR VS SRH : ఆఖరి ఓవర్లో హైదరాబాద్ విజయానికి 17 పరుగులు కావాలి. క్రీజులో సమద్, జాన్సన్ ఉన్నారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లో 9 పరుగులు కొట్టలేకపోయిన సమద్.. 17 రన్స్ ఏం చేస్తాడు లే.. అనుకున్నారంతా. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 2,6,2 తీశాడు. ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో విజయం మళ్లీ ఆర్ఆర్ వైపు మొగ్గు చూపింది. లాస్ట్ బాల్‌కు సమద్ క్యాచ్ ఔట్ అయ్యాడు. రాజస్థాన్ డగౌట్లో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా అంపైర్ నో బాల్ సిగ్నల్ ఇవ్వడంతో సీన్ మారింది. సమద్ సిక్సర్ బాది హైదరాబాద్ ఖాతాలో మరో విజయాన్ని చేర్చాడు.