ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ ఊపిరి పీల్చుకుంది. దిల్లీ క్యాపిటల్స్ మళ్లీ తీవ్ర నిరాశ తప్పలేదు. హ్యాట్రిక్ ఓటమిని తప్పించుకున్న రోహిత్ సేన.. తాజా ఐపీఎల్ సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇప్పటికే ఓటముల హ్యాట్రిక్ అందుకున్న దిల్లీ క్యాపిటల్స్.. వరుసగా నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఫలితంగా చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ముంబయి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్.. దిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయిలో కెప్టెన్ రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత తన మార్క్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అసలే హిట్‌మ్యాన్ అంటేనే కళ్లు చెదిరే షాట్లు, మెరుపు ఇన్నింగ్స్ మన కళ్ల ముందుకు కనిపిస్తాయి. కానీ ఐపీఎల్‌లో రోహిత్ మార్క్ ఇన్నింగ్స్ చూసి చాలా కాలం అయిపోయింది. గత 24 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఒక్కసారీ కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఫామ్‌లో లేక ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హిట్ మ్యాన్ చెలరేగిపోయాడు. వింటేజ్ రోహిత్‌ను గుర్తు చేస్తూ చెలరేగిపోయాడు. దిల్లీపై మెరుపులు మెరిపించాడు. 45 బంతుల్లో 6×4, 4×6 సాయంతో 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 147 కి.మీ వేగంతో నోకియా వేసిన బాల్‌ను మిడ్‌వికెట్‌లో హిట్‌మ్యాన్ సిక్సర్‌గా మలిచిన తీరును చూసి వావ్ అనాల్సిందే. మిగతా షాట్లూ ధనాధన్ బాదాడు. దీంతో ఛేదనలో ముంబయి దూసుకెళ్లింది. ఇక ఇషాన్ కిషన్(31; 26 బంతుల్లో 6×4) సైతం నిలకడగా రాణించాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబయి 68/0తో నిలిచింది.
రాణించిన తిలక్ వర్మ.. అయితే రోహిత్‌తో సమన్వయ లోపంతో ఇషాన్ రనౌట్ అయ్యాడు. అయినప్పటికీ మూడో స్థానంలో వచ్చిన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ(41; 29 బంతుల్లో 1×4, 4×6) రాణించడంతో ముంబయి స్కోరు బోర్డు బోర్డు పరుగెత్తింది. కాకపోతే ఆ తర్వాత మధ్యలో స్కోరు వేగం కాస్త తగ్గి దిల్లీ మళ్లీ పోటీలోకి వచ్చినట్లు కనిపించింది. కానీ తిలక్ మళ్లీ తగ్గేదే అన్నట్లు.. సరైన సమయంలో సిక్సర్లతో మోత మోగించేశాడు. ముంబయిని విజయానికి చేరువ చేశాడు. 27 బంతుల్లో 34 పరుగులే చేయాల్సి రావడంతో గెలుపు తేలికే అనిపించింది. కానీ 16వ ఓవర్లో లాస్ట్ 2 బాల్స్‌కు ముకేశ్.. తిలక్, సూర్యకుమార్ (0)లను ఔట్ చేసి ముంబయిని కాస్త ఒత్తిడిలోకి నెట్టాడు. రోహిత్ కూడా తర్వాతి ఓవర్లో ఔట్ అయ్యాడు. నోకియా.. 18వ ఓవర్లో 6 పరుగులే సమర్పించుకున్నాడు. దీంతో 2 ఓవర్లలో 20 పరుగులతో సమీకరణం కష్టంగా మారింది.