తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: ఉత్కంఠ మ్యాచ్​లో ఆర్సీబీపై లఖ్​నవూ విజయం.. పూరన్‌, స్టాయినిస్‌ విధ్వంసం

కోహ్లి చెలరేగిపోయాడు.. డుప్లెసిస్‌ రెచ్చిపోయాడు.. మ్యాక్స్‌వెల్‌ కూడా దంచేశాడు.. బెంగళూరు ఖాతాలో ఏకంగా 212 పరుగులు! కానీ ఏం లాభం? మ్యాచ్‌ చేతిలో ఉన్న సమయంలో బౌలర్ల లయ తప్పింది. బెంగళూరు కాస్త ఉదాసీనంగా ఉన్న సమయంలో స్టాయినిస్‌.. ఆ తర్వాత పూరన్‌ ఆ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆఖర్లో మ్యాచ్‌ మళ్లీ ఆర్సీబీ వైపు కాస్త మళ్లినట్లు కనిపించినా.. ఉత్కంఠను అధిగమించి లఖ్‌నవూనే పైచేయి సాధించింది.

ipl 2023 royal challengers bangalore lucknow super giants match winner
ipl 2023 royal challengers bangalore lucknow super giants match winner

By

Published : Apr 10, 2023, 11:01 PM IST

Updated : Apr 11, 2023, 6:28 AM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ 16వ సీజన్​లో భాగంగా లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​, రాయల్ ఛాలెంజర్స్​ జట్టు మధ్య రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్​లో పూరన్‌ (62; 19 బంతుల్లో 4×4, 7×6), స్టాయినిస్‌ (65; 30 బంతుల్లో 6×4, 5×6) చెలరేగడంతో ఒక్క వికెట్‌ తేడాతో బెంగళూరుపై లఖ్​నవూ గెలిచింది. వీరిద్దరితో పాటు బదోని (30; 24 బంతుల్లో 4×4) కూడా రాణించడం వల్ల లక్ష్యాన్ని లఖ్‌నవూ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్​, పర్నెల్​ తలో మూడు వికెట్లు తీశారు. హర్షల్ పటేల్ 2, కర్ణ్​ ఒక వికెట్​ పడగొట్టాడు.

బెంగళూరు నిర్దేశించిన భారీ టార్గెట్​ 213 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు మొదట్లోనే భారీ షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న కైల్‌ మేయర్స్‌ (0) డకౌటయ్యాడు. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లో మూడో బంతికి మేయర్స్‌ క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. తర్వాత పార్నెల్‌ ఒకే ఓవర్​లో దీపక్‌ హుడా (9), కృనాల్‌ (0)ను ఔట్‌ చేశాడు. దీంతో లఖ్‌నవూ 4 ఓవర్లలో 23/3తో కష్టాల్లో పడింది. ఆ తర్వాత రాహుల్‌ నిలిచినా.. ధాటిగా ఆడలేకపోయాడు. స్టాయినిస్‌ కూడా మొదట్లో అదే చేశాడు. కానీ క్రమంగా తన దూకుడు పెంచాడు. హర్షల్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4తో రెచ్చిపోయిన అతడు.. కర్ణ్‌ బౌలింగ్‌లో సిక్స్‌, రెండు ఫోర్లు బాదాడు. షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో మరో రెండు సిక్స్‌లు బాదడంతో లఖ్‌నవూ 10 ఓవర్లలో 91/3 చేసింది. కానీ అతడిని, రాహుల్‌ను.. కర్ణ్‌, సిరాజ్‌ వరుస ఓవర్లలో ఔట్‌ చేశారు. ఆ తర్వాత నికోలస్‌ పూరన్‌ తన వవర్‌ హిట్టింగ్‌తో రెచ్చిపోయి ఆడాడు. సిక్స్‌లతో వీరిబాదాడు. కర్ణ్‌, హర్షల్‌ ఓవర్లలో రెండేసి సిక్స్‌లు బాదిన అతడు.. పార్నెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో రెండు ఫోర్లు సిక్స్‌ బాదాడు. విల్లీకీ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌ను పూర్తిగా లఖ్‌నవూ వైపు తిప్పేశాడు. అతడికి చక్కని సహకారాన్నిస్తూ బదోని కూడా దూకుడుగా ఆడాడు. దీంతో లఖ్‌నవూ సమీకరణం తేలికైపోయింది.

అంతకుముందు.. టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్​ కోహ్లీ, ఫాఫ్​ డుప్లెసిస్ శుభారంభం చేశారు. ఆరంభం నుంచి దూకుడుగా ప్రతీ ఓవర్​లోనూ పరుగులు రారాజు విరాట్​ అదరగొట్టాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ అమిత్‌ మిశ్రా వేసిన 12 ఓవర్లో మూడో బంతికి స్టాయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి విరాట్ కోహ్లీ (61) పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి గ్లెన్​ మాక్స్​వెల్​ వచ్చాడు. డుప్లెసిస్, మాక్స్​వెల్​ ఇద్దరూ కలిసి చెలరేగిపోయారు. లఖ్​నవూ బౌలర్లు వేసిన బంతులకు బౌండరీలు బాది దుమ్ముదులిపారు. ఇద్దరూ హాఫ్​ సెంచరీలు సాధించారు. లఖ్​నవూ బౌలర్లకు ముప్పతిప్పలు పెట్టిన గ్లెన్​ మాక్స్​వెల్​(59) పెవిలియన్​ చేరాడు. ఆ తర్వాత దినేశ్​ కార్తీక్​ క్రీజులోకి వచ్చాడు. దినేశ్​(1*), డుప్లెసిస్​​(79*) నాటౌట్​గా నిలిచారు. లఖ్​నవూ బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్​వుడ్ తలో ఒక్క వికెట్​ తీశారు.

1.8 కోట్లు మంది..
లఖ్​నవూ- బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్​ను భారీగా అభిమానులు చూస్తున్నారు. బెంగళూరు బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో 1.8 కోట్ల మంది మ్యాచ్​ను వీక్షించారు. లీగ్​ చరిత్రలో ఇదే హైయెస్ట్​ వ్యూయర్​ షిప్​!

Last Updated : Apr 11, 2023, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details