ఐండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచులో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ (64*; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరిసి ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ (37; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోహిత్ శర్మ (28; 18 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ఇషాన్ కిషన్ (38; 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా బాగానే రాణించాడు. టిమ్ డేవిడ్ (16) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సన్ రెండు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఒక్కో వికెట్ తీశారు.
నాలుగో ఆటగాడిగా..ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓ ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హిట్‌మ్యాన్ ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలో ఆరు వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో అభిమానులు అతడికి అభినందనలు తెలుపుతున్నారు. రోహిత్ శర్మకు ఈ ఫీట్‌ను అందుకోవడానికి 226 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. హిట్ మ్యాన్ కన్నా ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 186 ఇన్నింగ్స్‌లలో, శిఖర్ ధావన్ 199 ఇన్నింగ్స్‌లలో, డేవిడ్ వార్నర్ 165 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించారు.