ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌ను వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్న రోహిత్.. ఐపీఎల్ కెరీర్లో అత్యధిక డకౌట్ల రికార్డు మూట గట్టుకున్నాడు. గత ఐదు మ్యాచ్‌ల నుంచి సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాడు. హిట్ మ్యాన్ అని పిలుచుకునే ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేస్తున్నాడు.
అయితే తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ క్రీజులో కుదురుకుని తమ ముందున్న భారీ లక్ష్యాన్ని ఛేదించి అభిమానులను మెప్పించాలనుకున్నాడు. ఇన్నింగ్స్‌లో ఆడిన తొలి బంతినే బౌండరీ బాది టచ్‌లోకి వచ్చినట్టే కనిపించాడు. కానీ అనూహ్యంగా ఐదో ఓవర్లో బంతిని అందుకున్న శ్రీలంక స్పిన్నర్ హసరంగా డిసిల్వ.. ఒక్క బాల్ తేడాతో ఇషాన్ కిషన్-, రోహిత్ శర్మ లను పెవిలియన్ చేర్చాడు. అయితే ఇక్కడ రోహిత్ ఔట్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఈ ఓవర్ ఆరో బంతికి రోహిత్ క్రీజును వదిలి ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి రోహిత్ బ్యాట్‌ను మిస్ అయ్యి ప్యాడ్స్‌ను తాకింది. దీంతో ఆర్సీబీ ప్లేయర్లు అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. రోహిత్ స్టంప్స్ ముందుకొచ్చి ఆడినందున బౌలర్ హసరంగా కూడా రివ్యూకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అనూహ్యంగా డీఆర్ఎస్ కోరాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను తాకినట్లు తేలింది. థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అంతే రోహిత్ సహా ప్రేక్షకులందరికీ ఆశ్చర్యపోవటం తమ వంతు అయింది. తను ఔట్ అయిన తీరును నమ్మశక్యం కాని రోహిత్ క్రీజును వదిలి వెళ్లటానికి అసంతృప్తి వ్యక్తం చేశాడు.