Rohit Sharma IPL : ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు. చాలా కాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ .. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు. టీ20ల్లో రోహిత్ 11 వేల పరుగులు పూర్తి చేశాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు విరాట్ కోహ్లీ (11864)ఈ మార్క్‌ను అందుకుని ప్రస్తుతం ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఛేదనలో 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ మైలురాయి అందుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 37 బంతుల్లో 56 పరుగులు చేసి అర్ధ శతకం చేశాడు. ఈ సీజన్లో అతడికిది రెండోది కాగా.. ఐపీఎల్‌లో 42వ హాఫ్ సెంచరీ. ఇదే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ఓక జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ముంబయి తరఫున రోహిత్ 5012 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కూడా విరాట్ కోహ్లీ ముందున్నాడు.ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ అత్యధికంగా 7162 పరుగులు చేశాడు.
వివ్రాంత్ శర్మ రికార్డు..ఈ మ్యాచ్‌లో మరో రికార్డు నమోదైంది. మయంక్ అగర్వాల్‌తో కలిసి సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన యంగ్ బ్యాటర్ ఓపెనర్ వివ్రాంత్ శర్మ.. ఐపీఎల్‌లో బ్యాటింగ్ చేసిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో (47 బంతుల్లో 69; 9 ఫోర్లు,2 సిక్సర్లు) కదం తొక్కాడు. దీంతో అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వివ్రాంత్ కంటే ముందు రాజస్థాన్ ఆటగాడు స్వప్నిల్ అస్నోద్కర్ (60) ఈ ఫీట్ సాధించాడు. ఈ రికార్డుతో పాటు వివ్రాంత్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. సన్‌రైజర్స్ తరఫున అత్యంత చిన్న వయసులో (23 ఏళ్ల 203 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.
ఇక విజయంతో ఈ సీజన్‌ను ముగించాలనుకొన్న సన్‌రైజర్స్‌కు నిరాశే మిగిలింది. ఓపెనర్ల దూకుడుతో 200 మార్క్‌ను అందుకున్నా.. అంత భారీ స్కోరును కాపాడుకోలేకపోయింది. ఛేదనలో ముంబయి ఓపెనర్ ఇషాన్ త్వరగా ఔట్ అయినప్పటికీ.. కెప్టెన్ రోహిత్, కామెరూన్ గ్రీన్ సన్‌రైజర్స్ బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ చెలరేగి ఆడి ముంబయికి విజయం కట్టబెట్టారు.