తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: తొలి మ్యాచ్‌లోనే బౌలర్లకు రాజస్థాన్​ ప్లేయర్ షాక్​​.. ఎవరీ ధ్రువ్? - ధ్రువ్​ జురెల్ వార్తలు

పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు చెందిన యువ ఆటగాడు ధ్రువ్​ జురెల్​ అదరగొట్టాడు. అరంగేట్ర మ్యాచ్​లోనే తనదైన షాట్లతో అలరించాడు. ఎవరీ ధ్రువ్​ జురెల్​?

dhruv jurel
dhruv jurel

By

Published : Apr 6, 2023, 3:16 PM IST

క్రికెట్‌ ప్రపంచానికి ఎంతో మంది యువ ఆటగాళ్లను పరిచయం చేసింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. తాజాగా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నుంచి మరో యువ సంచలనం పుట్టుకొచ్చాడు! అతడే రాజస్థాన్​ రాయల్స్‌ జట్టుకు చెందిన ధ్రువ్ జురెల్. ఐపీఎల్‌ 16వ సీజన్​లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్​ జట్టు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ధ్రువ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు.

అయితే ఈ మ్యాచ్​లో రాజస్థాన్​ జట్టు.. ఓటమిపాలైనప్పటికీ ధ్రువ్​​ మాత్రం.. అందరి మనసులు గెలుచుకున్నాడు. పంజాబ్​ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 15 బంతులు ఆడిన ధ్రువ్​ జురెల్​.. మూడు ఫోర్లు, రెండు సిక్స్​లు బాదాడు. 32 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా పంజాబ్​ బౌలర్​ అర్ష్​దీప్​ సింగ్​ వేసిన 19వ ఓవర్​లో ధ్రువ్​ షాట్​లు వేరే లెవెల్​ అని చెప్పొచ్చు. ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే సూపర్​ ఇన్నింగ్స్​ ఆడిన ఈ ప్లేయర్​పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్నాయి.

ఎవరీ ధ్రువ్ జురెల్?
22 ఏళ్ల ధ్రువ్ జురెల్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో ధ్రువ్ ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2020 అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన ధ్రువ్ జురెల్ 89 పరుగులు సాధించాడు. తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 587 పరుగులు సాధిచాడు. 2022-23 రంజీ సీజన్‌లో నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జురెల్ అద్భుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా వచ్చిన అతడు 329 బంతులు ఎదుర్కొని 249 పరుగులు చేశాడు.

టీ20ల విషయానికి వస్తే.. ఇప్పటివరకు 4 టీ20లు మాత్రమే ఆడాడు ధ్రువ్. 89 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు రాజస్థాన్​ రాయల్స్‌ ధ్రువ్ జురెల్‌ను కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్‌లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని మాత్రం అతడు సద్వినియోగం చేసుకున్నాడు.

బుధవారం జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ చేతిలో రాజస్థాన్​ ఓటమిపాలైంది. పంజాబ్​ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. రాజస్థాన్​​ ఓపెనర్లు యశస్వి(11), రవిచంద్రన్​ అశ్విన్​ విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన జోస్​ బట్లర్​(19) దూకుడుగా ఆడేందుకు యత్నంచి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్​(42).. జట్టు స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కానీ నాథన్​ బౌలింగ్​లో క్యాచ్​ ఔటయ్యాడు. హెట్మెయర్ 36, ధ్రువ్‌ జురెల్ 32 పరుగులు చేసి పోరాడినా రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. పంజాబ్‌ బౌలర్ నాథన్‌ ఎల్లిస్‌ 4 వికెట్లు తీసి రాజస్థాన్‌ జట్టు పతనాన్ని శాసించాడు.

ABOUT THE AUTHOR

...view details