Yashasvi Jaiswal Fifty: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కోల్‌కతాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 150 పరుగుల టార్గెట్‌ను.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించి గెలుపొందింది. ఇక పింక్ జట్టు మెంబర్.. యశస్వి జైస్వాల్ మైదానంలో అద్భుత ప్రదర్శనను చూపించాడు. 47 బంతుల్లోనే 98 పరుగులను స్కోర్ చేసి.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తన స్కోర్‌తో రాజస్థాన్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. కానీ ఇదే జైస్వాల్.. రాజస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలో బట్లర్ రనౌట్‌కు కారణమయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
యశస్వి వీరబాదుడు.. జైస్వాల్ కోసం బట్లర్ త్యాగం.. సంజూ ఆరాటం! - Yashasvi Jaiswal latest news
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మెరిశాడు. ఈ క్రమంలో ఈ వేదికగాపై పలు ఆసక్తికరమైన ఘటనలు జరిగాయి. అవేంటంటే
ఇన్నింగ్స్ రెండో ఓవర్లో హర్షిత్ రానా వేసిన నాలుగో బంతిని బట్లర్ పాయింట్ దిశగా ఆడాడు. అయితే బాల్‌ను చూస్తూ బట్లర్ క్రీజు నుంచి కాస్త ముందుకు కదిలాడు. అయితే బట్లర్.. సింగిల్ కోసం వస్తున్నాడేమోనని భావించిన జైస్వాల్ అటు వైపు నుంచి పరిగెత్తుకొచ్చాడు. అయితే అతను వస్తున్నది గమనించిన బట్లర్.. అతన్ని వద్దనకుండా .. తాను నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగులు తీశాడు. అయితే అప్పటికే బాల్‌ను అందుకున్న రసెల్.. మెరుపు వేగంతో త్రో విసరగా.. డైరెక్ట్ హిట్‌కు బట్లర్ ఔటయ్యాడు. అయితే జైస్వాల్‌ను ఔట్ చేయడం ఇష్టం లేక బట్లర్ తన వికెట్‌ను త్యాగం చేశాడు. అయితే బట్లర్ త్యాగాన్ని అర్థం చేసుకున్న జైస్వాల్.. దాన్ని ఏ మాత్రం వృథా కానివ్వలేదు. అతని కారణంగా బట్లర్ ఔటయ్యాడన్న విషయం తెలుసుకుని మైదానంలో మరింత ధాటిగా ఆడాడు. అలా.. 13 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ఇక అదే సమయంలో డగౌట్‌లో ఉన్న బట్లర్ పైకి లేచి చప్పట్లతో అభినందించడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
జైస్వాల్ రికార్డ్ కోసం.. సంజూ హార్డ్‌వర్క్
ఇదే మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా మైదానంలో విజృంభించాడు. దీంతో 13 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మార్క్ సాధించిన జైస్వాల్‌కు ఈజీగా సెంచరీ చేసే అవకాశం లభించింది. అయితే ఇన్నింగ్స్ చివర్లో కేకేఆర్ బౌలర్ సుయాశ్ శర్మ జైశ్వాల్ సెంచరీ చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించాడు. కానీ సంజూ శాంసన్ మాత్రం యశస్వి ఎలాగైనా సెంచరీ కొట్టాలని ఆశించాడు. ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఆఖరి బంతిని సుయాశ్ శర్మ వైడ్ వేయడానికి యత్నించగా.. శాంసన్ ఆ వైడ్‌బాల్‌ను కాస్త డాట్‌బాల్‌గా మార్చాడు. ఇక మ్యాచ్ తర్వాత జైస్వాల్ వైపు చూస్తూ బ్యాట్‌ను పైకెత్తిన సంజూ.. సిక్సర్‌తో నువ్వు ఇక సెంచరీ పూర్తి చేసుకో.. అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో తోటి ప్లేయర్ సెంచరీ కోసం పరితపించిన సంజూను అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.