IPL 2023 PBKS Vs DC : ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా పంజాబ్ సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. బుధవారం దిల్లీ జట్టు 15 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. దిల్లీ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేయగలిగింది. ఛేదనలో లివింగ్‌స్టన్ (94) గొప్పగా పోరాడినా.. పంజాబ్‌ను గెలిపించలేకపోయాడు. నోకియా (2), ఇషాంత్ శర్మ (2), అక్షర్ పటేల్ (1) ఆ జట్టును దెబ్బ తీశారు. 13 మ్యాచ్‌ల్లో పంజాబ్‌కిది ఏడో ఓటమి. ఆ జట్టు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. దిల్లీ బ్యాటర్లలో పృథ్వీ షా (54; 38 బంతుల్లో), 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రిలీ రొసో (82*; 37 బంతుల్లో) అర్ధశతకాలతో దూకుడుగా ఆడారు. 46 పరుగులతో రాణించిన డేవిడ్ వార్నర్ త్రుటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరణ్ 2 వికెట్లు పడగొట్టాడు.
దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆటతీరుతో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే వార్నర్‌కు బ్యాటింగ్ పరంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్‌లో కాస్త స్లోగా ఆడినప్పటికీ 13 మ్యాచ్‌ల్లో 430 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో ఐదు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ చరిత్రలో 400 ప్లస్ పరుగుల మార్క్‌ను దాటడం వార్నర్‌కు ఇది తొమ్మిదోసారి కావడం విశేషం. ఈ ఘనతను సాధించిన నాలుగో ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. ఇంతకముందు సురేశ్ రైనా, శిఖర్ ధావన్, కోహ్లీ తొమ్మిది ఐపీఎల్ సీజన్లలో 400 ప్లస్ పరుగులు మార్క్‌ను అందుకోగా.. తాజాగా వార్నర్ వీరి సరసన చేరాడు.
రెచ్చిపోయిన రిలీ రొసో..
ఎలాగూ ప్లేఆఫ్స్ అవకాశాలు చేజారడం వల్ల దిల్లీ జట్టు అదురు బెదురు లేకుండా ఆడింది. వార్నర్ దూకుడు కొనసాగించగా.. నామమాత్రపు మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న పృథ్వీ షా ఈ సీజన్లో తొలిసారి ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరూ కలిసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయగా.. రొసో విధ్వంసక బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చాడు.
దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా.. రీఎంట్రీలో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అవకాశం అందుకున్న పృథ్వీ షా.. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వెంటనే తన రెండు చేతులనూ చూపిస్తూ వినూత్న రీతిలో సంబరాలు చేసుకున్నాడు. ఆ సెలబ్రేషన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమయ్యాయి. అతడి సెలబ్రేషన్స్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ఫ్యాన్స్ ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికీ తోచిన విషయం వారు చెబుతున్నారు. తమ కోచ్ పాంటింగ్‌ను ఉద్దేశించి పృథ్వీ షా అలా వినూత్నంగా సెలెబ్రేట్ చేసుకున్నాడని ఒకరంటే.. బౌన్సర్లతో తన రెండు చేతులకు గాయాలయ్యాయని, అయినా అర్థ శతకం సాధించానని చెబుతున్నాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తనతో గొడవపడిన యూట్యూబర్ సప్నా గిల్‌ను ఉద్దేశించే వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడని అంటున్నారు. ఏదేమైనా పృథ్వీ షా సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.