IPL 2023 PBKS Vs RR : ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలకమైన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. పంజాబ్‌తో జరిగిన కీలక పోరులో రాజస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. ఇక 14 మ్యాచులు ఆడిన పంజాబ్ 6 విజయాలు, 8 ఓటములతో ఈ సీజన్‌ను ముగించింది. అటు రాజస్థాన్ 14 మ్యాచుల్లో 7 ఓటములు, 7 విజయాలతో 14 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో నిలిచి.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ.. బెంగళూరు, ముంబయి తమ చివరి మ్యాచ్‌లో ఓడితేనే ప్లేఆఫ్స్‌లోని నాలుగో బెర్తును ఖరారు చేసుకొనే అవకాశం ఉంది. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ సాధించిన దేవదత్ పడిక్కల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
ఛేదనలో రాజస్థాన్..
డేంజరస్ ఓపెనర్ జోస్ బట్లర్ (0) మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. అయినప్పటికీ.. ఆ ప్రభావం రాజస్థాన్ ఛేదనపై పడలేదంటే దానికి కారణం యశస్వి జైస్వాల్ (50), దేవదత్ పడిక్కల్ (51). వీరిద్దరూ అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. ఈ జోడి రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించింది. అయితే, పడిక్కల్‌తోపాటు సంజూ శాంసన్ (2) పెవిలియన్‌కు చేరడంతో ఇబ్బంది పడినట్లు అనిపించింది. కానీ, యశస్వితో కలిసి హెట్మయర్ (46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.