ఐపీఎల్ 16వ సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గత రెండు మ్యాచ్‌ల్లో ఊహించని షాక్ తగిలింది. రాజస్థాన్, పంజాబ్‌లతో ఆడిన మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. తాజాగా పంజాబ్‌పై.. విజయం అంచుల దాకా వచ్చి ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించి ఉంటే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునేది. ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగయ్యేవి. ఇప్పుడు పంజాబ్ ఈ విజయంతో సీఎస్‌కే నాలుగో స్థానానికి పరిమితమైంది. పంజాబ్ కింగ్స్ ఆరో స్థానం నుంచి ఐదుకు ఎగబాకింది.
మరిన్ని పరుగులు చేయాల్సింది
పంజాబ్‌తో మ్యాచ్‌లో తమ ఓటమికి బ్యాటింగ్‌లో ఇంకొన్ని పరుగులు చేయకపోవడమే ప్రధాన కారణమని చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. 'మేం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మరిన్ని పరుగులను అదనంగా చేయాల్సింది. కనీసం మరో 15 పరుగులు చేసి ఉంటే బాగుండేది. మా బ్యాటర్లు స్థిరంగా పరుగులు రాబట్టారు. ఈ పిచ్ మీద 200 పరుగులు మంచి స్కోరే. అయితే, మా బౌలింగ్ కూడా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. రెండు ఓవర్లు మా ఫలితాన్ని మార్చేశాయి. సమస్య ఎక్కడుందో సమీక్షించుకోవాలి. మా ప్రణాళికలో ఏదైనా పొరపాటు ఉందా? ప్లాన్‌ను అమలు చేయడంలో లోపాలు ఉన్నాయా? అనేది తెలుసుకుంటాం. పతిరాణా చాలా అద్భుతంగా బౌలింగ్ వేశాడు' అని ధోనీ అన్నాడు.
పంజాబ్ ఛేదనలో... 16వ ఓవర్లో దేశ్‌పాండే ఏకంగా 24 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత ఓవర్‌లో ధోనీ.. బంతిని జడేజాకు ఇచ్చాడు. అయితే జడ్డూ ఈ ఓవర్లో 17 పరుగులు సమర్పించాడు. అయితే ధోనీ ఈ రెండు ఓవర్ల గురించే వ్యాఖ్యానించాడు. ఇకపోతే 19వ ఓవర్‌లోనూ పాండే మరో 13 పరుగులు ఇచ్చాడు. దీంతో పంజాబ్ బ్యాటర్లు కేవలం 18 బంతుల్లోనే 54 పరుగులను సాధించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటింది మొన్న రాజస్థాన్ ఇప్పుడు తాజాగా పంజాబ్ కింగ్స్ ఈ ఫీట్‌ను సాధించింది. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరి బంతికి పంజాబ్ లక్ష్య ఛేదన పూర్తి చేసి సంచలనం సృష్టించింది. సీఎస్‌కే నిర్దేశించిన 201 పరుగుల టార్గెట్‌ను పూర్తి 20 ఓవర్లు ఆడి, ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. పంజాబ్ గెలుపునకు చివరి బంతికి మూడు పరుగులు అవసరం అయ్యాయి. పతిరాణా వేసిన బంతిని సికందర్ రజా బ్యాక్‌వర్డ్ స్క్వేర్ దిశగా పంపి మూడు రన్స్ తీసేశాడు. అంతే పంజాబ్ శిబిరంలో పండగ వాతావరణం నెలకొంది.
సామ్ స్మైల్‌కు మహీ రిప్లై!
చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలా రోజులకి తనలోని ఫినిషర్ మరోసారి గుర్తుచేశాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ చివరి రెండు బంతుల్లో.. తన మార్క్ స్టైల్ హెలీకాప్టర్ షాట్లు ఆడాడు. అయితే, సామ్ కరన్ వేసిన 19.2 బంతికి ధోనీ భారీ షాట్‌కి ప్రయత్నించి విఫలం అయ్యాడు. దీనికి సామ్ చిన్న నవ్వు నవ్వాడు. 19.3 బంతికి సైలెంట్‌గా సింగిల్ తీసుకున్న ధోనీ ఆఖరి 2 బంతుల్లో సిక్స్‌లు బాదాడు. దీంతో చెన్నై స్కోరు 200 మార్క్ అందుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ గెలుపు మాకు ఎంతో ప్రత్యేకం
'ఈ విజయం మాకు మరింత ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఈ గెలుపు మాకు ఎంతో ప్రత్యేకమైంది. చెపాక్‌లో చెన్నైను ఓడించడం అతిపెద్ద విషయం. మా ఆటగాళ్లు అద్భుతమైన పోరాట పటిమను కనబరిచారు. గత మ్యాచ్‌లో ఘోర ఓటమి తర్వాత పుంజుకుని గెలవడం ఎంతో బాగుంది. మా బౌలర్లు కూడా తమవంతు కృషి చేశారు. ఛేదనలో లియామ్ లివింగ్‌స్టోన్ టచ్‌లోకి రావడం ఆనందంగా ఉంది. అందరూ ఉత్తమంగా ఆడటం శుభసూచికం' అని పంజాబ్ కెప్టెన్ ధావన్ తెలిపాడు.