తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 PBKS VS LSG : లఖ్‌నవూ బ్యాటర్ల విధ్వంసం.. మొహాలిలో దంచి పడేశారుగా! - IPL 2023 PBKS VS LSG stats

రబాడ, అర్ష్‌దీప్‌ లాంటి మంచి బౌలర్ల కట్టడితో.. ధావన్‌, లివింగ్‌స్టోన్‌ లాంటి ప్లేయర్ల బ్యాటింగ్​ స్కిల్స్​తో ఈజీగా లక్ష్యాన్ని ఛేదిద్దామనుకున్న పంజాబ్​కు నిరాశే ఎదురయ్యింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. కానీ బ్యాటింగ్‌కు స్వర్గధామంలా కనిపించిన మొహాలి పిచ్‌పై.. లఖ్‌నవూ బ్యాటర్లు విరుచుకుపడటం వల్ల పంజాబ్​కు ఇక ఓటమి తప్పలేదు.

IPL 2023 PBKS VS LSG
IPL 2023 PBKS VS LSG

By

Published : Apr 28, 2023, 10:59 PM IST

Updated : Apr 29, 2023, 8:59 AM IST

గత మ్యాచ్​లో సొంతగడ్డపై నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి చవిచూసిన లఖ్‌నవూ జట్టు.. శుక్రవారం మొహాలిలో జరిగిన మ్యాచ్​లో ఏకంగా పంజాబ్‌కు 258 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి.. 56 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మొదట మేయర్స్‌, స్టాయినిస్‌, పూరన్‌, బదోని మైదానంలో రెచ్చిపోవడం వల్ల సూపర్‌జెయింట్స్‌ 5 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగలిగింది.ఆ తర్వాత రంగంలోకి దిగిన పంజాబ్​ జట్టు.. 19.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. అథర్వ టైడ్‌ టాప్‌స్కోరర్​గా నిలవగా..యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, నవీనుల్‌ హక్‌, ఆ జట్టును కట్టడి చేశారు. దీంతో 8 మ్యాచ్‌ల్లో లఖ్‌నవూకు ఇది అయిదో విజయం కాగా.. పంజాబ్‌ జట్టు మాత్రం నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.

ఆ ఓపెనర్‌.. ఈ స్పిన్నర్‌
ఈ సీజన్లో పంజాబ్​ జట్టు తరఫున ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన యువ ఓపెనర్‌ అథర్వ.. ఈ మ్యాచ్‌లో తన ముద్రను చాటాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో 0, 4, 29 పరుగులే చేసినప్పటికీ.. తుది జట్టులో కొనసాగిస్తూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. చక్కటి టైమింగ్‌తో అలవోకగా ఆడిన ఈ యంగ్​ ప్లేయర్​.. భారీ షాట్లు ఆడుతూ కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకాన్ని సాధించాడు. 3

ఇక పంజాబ్‌ అంత లక్ష్యాన్ని ఛేదించేస్తుందన్న అంచనాలు లేకపోయినప్పటికీ.. గౌరవప్రదంగా ఓడిందంటే అందుకు కారణం అథర్వనే. ధావన్‌, ప్రభ్‌ సిమ్రన్​ లాంటి ప్లేయర్ల వికెట్లను త్వరగా కోల్పోయి పరాభవం చవిచూసేలా కనిపించిన ఆ జట్టును అతను.. సికందర్‌ రజాతో కలిసి ఆదుకున్నాడు. వీళ్లిద్దరికీ తోడు సామ్‌ కరన్‌, లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ కూడా తలో చేయి వేయడం వల్ల పంజాబ్‌ 200 స్కోర్​ దాటింది. మరోవైపు రెండో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న లఖ్‌నవూ స్పిన్నర్‌ యశ్‌ ఠాకూర్‌ ఈ మ్యాచ్​లో 4 వికెట్లు పడగొట్టి మెరిశాడు. పేసర్‌ నవీనుల్‌ సైతం ఆకట్టుకున్నాడు.

బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న మొహాలి పిచ్‌పై లఖ్‌నవూ బ్యాటర్లు చెలరేగిపోయారు. నెమ్మదిగా ఆడే ఆ జట్టు కెప్టెన్‌ రాహుల్‌..ఆరంభంలోనే పెవిలియన్‌ చేర్చడం వల్ల కింగ్స్‌కు చేటు చేసిందనే చెప్పాలి. మిగతా బ్యాటర్లెవ్వరూ అతడిలా ఆచితూచి ఆడే ప్రయత్నమే చేయలేదు. ఎప్పుడో కానీ రెండంకెల స్కోరు చేయని యువ ఆటగాడు బదోని సైతం బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందు వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇక స్టాయినిస్‌, మేయర్స్‌, పూరన్‌ అయితే బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నారు. మొదట్లో మేయర్స్‌ కొట్టిన కొట్టుడుతోనే పంజాబ్‌ బౌలర్లందరి లెక్కలన్నీ తారుమారైపోయాయి. కింగ్స్‌ ఉత్తమ బౌలరైన అర్ష్‌దీప్‌ వేసిన రెండో ఓవర్లో నాలుగు ఫోర్లతో మొదలైన అతడి విధ్వంసం ఆరో ఓవర్లో ఔటయ్యే వరకు కొనసాగింది. అప్పటికే స్కోరు 74 పరుగులకు చేరుకోవడం విశేషం.

మేయర్స్‌ వెనుదిరిగాక ఆ బాధ్యతను బదోని, స్టాయినిస్‌, తీసుకున్నారు. స్టాయినిస్‌ భారీ షాట్లు ఆడటం కొత్తేం కాదు కానీ.. బదోని అలవోకగా బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే ఇక్కడ ఆసక్తికర విషయం. ఈ జోడీ కేవలం 26 బంతుల్లోనే అర్ధశతక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. 38 పరుగుల వద్ద తన క్యాచ్‌ను అందుకున్న తర్వాత లివింగ్‌స్టోన్‌ కాలిని బౌండరీ హద్దుకు తాకించడం వల్ల జీవన దానం అందుకున్న స్టాయినిస్‌ చివరిదాకా తన దూకుడును అలానే కొనసాగించాడు. అతడితో మూడో వికెట్‌కు 46 బంతుల్లోనే 89 పరుగులు జోడించిన బదోని 14వ ఓవర్లో ఔటయ్యాడు.

అప్పటికే స్కోరు 160 దాటిపోయింది. ఆపై స్టాయినిస్‌, పూరన్‌ పోటీ పడి పంజాబ్‌ బౌలింగ్‌ను ఊచకోత కోయడం వల్ల 16 ఓవర్లకే 200 మార్కును అందుకున్న సూపర్‌జెయింట్స్‌.. బెంగళూరు పేరిట ఉన్న ఐపీఎల్‌ రికార్డు స్కోరు (263) మీద కన్నేసింది. ఆఖర్లో స్టాయినిస్‌, పూరన్‌ ఔటవకపోతే ఆ రికార్డు కచ్చితంగా బద్దలయ్యేదే. రాహుల్‌ చాహర్‌ (4-0-29-0) మినహా బౌలర్లందరూ 12 కంటే ఎకానమీ నమోదు చేశారు.

Last Updated : Apr 29, 2023, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details