పది రోజుల క్రితం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా ముంబయి ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 214 పరుగుల ఛేదనలో గెలిచేలా కనిపించిన రోహిత్ సేన.. చివరి ఓవర్లో 16 పరుగులు చేయలేక ఓటమిని అందుకుంది. ఇప్పుడు తాజాగా మొహాలీ వేదికగా ముంబయికి అదే ప్రత్యర్థితో మ్యాచ్. మళ్లీ దాదాపు అంతే లక్ష్యం. కానీ ఈ సారి ముంబయి పట్టు వదల్లేదు. అలా అని చివరి ఓవర్ వరకు కూడా మ్యాచ్‌ను తీసుకెళ్లలేదు. రసవత్తరంగా సాగిన ఈ పోరులో 215 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించి అదరగొట్టింది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. గత మ్యాచ్ హీరో లివింగ్స్టన్ (42 బంతుల్లో 82 పరుగులు: 7x4, 4x6), జితేశ్ శర్మ (49: 5x4, 2x6) ముంబయి బౌలర్లపై దాడి చేశారు. ధావన్(30), మ్యాథ్యూ షార్ట్ (27), పరుగులతో రాణించారు. ఫలితంగా ముంబయి ముందు భారీ లక్ష్యాని ఉంచారు. ముంబయి బౌలర్లలో చావ్లా (2/29) ఆకట్టుకున్నాడు. గ్రీన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఎక్స్ట్రాల రూపంలో ముంబయి బౌలర్లు 17 పరుగులు ఇచ్చుకున్నారు.