ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా కోల్‌కతా, ముంబయి జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. కోల్‌కతా నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.. 17.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టార్గెట్ ఛేదించింది. 5 వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. ఇషాన్ కిషన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి.. 25 బంతుల్లో హాఫ్ సెచరీ పూర్తి చేశాడు. తిలక్ వర్మ (30), రోహిత్ శర్మ (20). సూర్య కుమార్ యాదవ్ (43), టిమ్ డేవిడ్ (23) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో సుయాశ్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, శార్దుల్ ఠాకుర్, ఫర్గూసన్ ఓక్కో వికెట్ చొప్పున తీశారు.
అంతకుముందు.. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(104) శతక ప్రదర్శన చేశాడు. రింకూ సింగ్(18), ఆండ్రూ రసెల్ (21*) ఫర్వాలేదనిపించారు. జగదీశన్ (0), నితీశ్ రాణా (5), శార్దుల్ ఠాకూర్ (13), సునీల్ నరైన్ (2*) పేలవ ప్రదర్శన చేశారు. ఇక, ముంబయి బౌలర్లలో హృతిక్ శోకీన్ (2) వికెట్లు పడగొట్టాడు. కామెరూన్ గ్రీన్, జాసెన్, పీయుశ్ చావ్లా, మెరెడిత్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
రోహిత్ శర్మ 'ఇంపాక్ట్'..
అస్వస్థత కారణంగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడటం లేదని.. తాత్కాలిక కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చెప్పాడు. కానీ, అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ ఓపెనర్‌గా దిగాడు. 13 బంతుల్లో 20 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఐపీఎల్ తొలి కవలలు..
సౌతాఫ్రికాకు చెందిన మర్కో జాన్‌సెన్, డ్యూన్ జాన్‌సెన్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరుదైన ఘనత సాధించారు. ఈ లీగ్‌లో ఆడిన మొదటి కవలలుగా నిలిచారు. ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా డ్యూన్ జాన్‌సెన్ తుది జట్టులో ఆడాడు. దీంతో ఈ ఘనత సాధించారు. అయితే ఈ మ్యాచ్‌లో డ్యూన్ కోల్‌కతాకు భారీగా పరుగులు సమర్పించాడు. 4 ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చాడు.
మార్కో జాన్‌సెన్ విషయానికొస్తే.. ఈ ప్లేయర్ ఇంతకుముందు ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున ఆడాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన మార్కో 13 వికెట్లు తీశాడు. 28.62 సగటుతో.. 8.27 ఎకానమీ రేట్‌తో.. ఐపీఎల్ టాప్ బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు.
వెంకటేస్ తొలి సెంచరీ..
వెంకటేశ్ అయ్యర్ ఎదురుచూపులకు తెర పడింది. ఐపీఎల్లో తొలిసారి సెంచరీ బాదాడు. మెక్ కల్లమ్ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున శతక ప్రదర్శన చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. మెక్ కల్లమ్ ఐపీఎల్ తొలి సీజన్లో మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత సెంచరీ అనేది కోల్‌కతా జట్టు డిక్షనరీలో కనుమరుగైంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత.. కోల్‌కతా సెంచరీల కరవును తీర్చాడు వెంకటేశ్.