క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మరో రెండు రోజుల్లోనే ప్రారంభం కానుంది. అయితే సీజన్ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. సీజన్‌లోని కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైన్ల్తో పాటు వన్డే ప్రపంచకప్‌కు.. కొన్ని నెలలే ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లను రోహిత్ లైట్ తీస్కోనున్నట్లు సమాచారం. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడట. మెగా టోర్నీలకు ఫిట్‌గా ఉండేందుకే రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడని, అందుకు ముంబయి ఇండియన్స్ యాజమాన్యం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించనున్నాడట.
కాగా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరమే రోహిత్ శర్మ.. భారత ఆటగాళ్ల వర్క్‌లోడ్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశాడు. మెగా టోర్నీలో భాగమయ్యే ప్రతీ ప్లేయర్ వర్క్‌లోడ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలిస్తుందని, ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను సమన్వయం చేయాలని సూచించాడు. ఆయా ఫ్రాంచైజీల్లో ఉన్నా.. భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల ప్రిపరేషన్స్.. బీసీసీఐ కనుసన్నల్లో జరుగుతాయని తెలిపాడు. ఈ క్రమంలోనే అతనే ఇతర ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచేందుకు కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడకుండా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
టోర్నీ పరిస్థితులను బట్టి రోహిత్ 5-7 మ్యాచ్‌లు దూరమయ్యే అవకాశాలున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వారం రోజులకే టీమ్ఇండియా.. ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ ఏడాదే భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీల నేపథ్యంలో భారత కీలక ఆటగాళ్లు గాయపడకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకోనుంది.
మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో నాలుగు సార్లు టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అంత కన్నా ముందు భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను బీసీసీఐ ప్లాన్ చేసింది. టాలీవుడ్ బ్యూటీలు తమన్న భాటియా, రష్మిక మందన్న లైవ్ డ్యాన్స్ ఫెర్మార్మెన్స్ ఉండనున్నట్లు సమాచారం. దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.