IPL 2023 suryakumar yadav century : ముంబయి, గుజరాత్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో సూర్య కుమార్ ఆటే హైలైట్. కళ్లు చెదిరే షాట్లతో నమ్మశక్యం కాని రీతిలో సాగింది అతడి ఆట. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా గుజరాత్ బౌలర్లను ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ వారిపై విరుచుకుపడ్డాడు. లీగ్ ఆరంభంలో కాస్త తడబడ్డ సూర్య.. తర్వాత పుంజకున్న తీరు అద్భుతం. ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసిన సూర్య, మరో 17 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని స్టాండ్స్‌లోకి పంపిన సూర్య ఐపీఎల్లో మొదటిసారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు.
రోహిత్ సిక్సర్ల మోత.. ఈ సీజన్లో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్న ముంబయి కెప్టెన్ రోహిత్ ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. 252 సిక్సర్లతో హిట్‌మ్యాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ తర్వాత వరుసగా ధోని 239, విరాట్ 229 రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా రోహిత్ రెండో స్థానంలో ఉండగా... వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ 357సిక్సర్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు.
రషీద్ ఆల్‌రౌండ్ షో.. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓడినప్పటికీ ఆ జట్టు ఆటగాడు రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. మొదటగా బౌలింగ్ చేసిన రషీద్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఓపెనర్లు సహా యువ కెరటం నెహాల్ వధేరాను వెనక్కి పంపాడు. ఇక ఛేదనలో ఊహించని రీతిలో ముంబయి బౌలర్లపై దాడి చేశాడనే చెప్పుకోవాలి. గుజరాత్ ఓటమి దాదాపు ఖరారైనప్పటికీ.. రన్ రేట్ మెరుగుపరిచేందుకు రషీద్ క్రీజులో చిన్నపాటి బీభత్సం సృష్టించాడు. ఏకంగా 10 సిక్సర్లు బాది 79 పరుగులు చేసి గుజరాత్ ఓటమి అంతరాన్ని తగ్గించాడు.
12 ఏళ్ల తర్వాత వాంఖడేలో... దాదాపు 12 ఏళ్ల తర్వాత వాంఖడే స్టేడియంలో ముంబయి బ్యాటర్ సెంచరీ నమోదు చేశాడు. ముంబయి ఇండియన్స్ హోం గ్రౌండ్ వాంఖడేలో చివరి సారిగా సచిన్ తెందూల్కర్ 2011లో శతకం సాధించగా.. తాజాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో సూర్య సెంచరీ బాది రికార్డు సృష్టించాడు.