ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ ప్రారంభమైంది. అందులో భాగంగా లఖ్‌నవూ టాస్ గెలుచుకుంది. బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించింది. టోర్నీలో ఇప్పటివరకు ఇరుజట్లు ఆడిన మ్యాచ్‌లను పరిశీలిస్తే.. లఖ్‌నవూ 3 ఆడి రెండింట్లో గెలిచి ఒకదాంట్లో ఓడిపోయింది. మరోవైపు బెంగళూరు 2 మ్యాచుల్లో ఒకదాంట్లో విజయం సాధించి.. మరో మ్యాచులో పరాజయం పాలైంది. రెండు జట్లు తలపడిన గత ప్రదర్శనను చూస్తే ఆర్సీబీదే పైచేయిగా కనిపిస్తోంది. కానీ, ఈ జట్టుపై లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తుదిజట్టు:
కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, జయ్‌దేవ్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.
బెంగళూరు తుది జట్టు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్) , విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, పార్నెల్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్.
అంతకముందు.. తాము లఖ్‌నవూతో మ్యాచ్ కోసం గట్టిగా రెడీ అవుతున్నామని, కోల్‌కతా చేతిలో ఓటమిని మర్చిపోయి రాణించాలని అనుకుంటున్నామని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెప్పాడు. 'జట్టులో అదే రివ్యూ పద్ధతి ఉండటమే నాకు ముఖ్యం. అది తొలి మ్యాచ్‌లో అన్నీ అనుకున్నట్లు జరిగినప్పుడైనా లేదంటే ఏదీ అనుకున్నట్లు జరగని రెండో మ్యాచులో అయినా.. ఎప్పుడైనా అలాంటి ఒక పద్ధతి ప్రకారమే ఆడాలి. మేం సరిగ్గా చేసిన పనులు, మెరుగవ్వాల్సిన అంశాలపై ఫోకస్ పెట్టడం ముఖ్యం' అని చెప్పాడు. తమ జట్టు అంతా పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉందని, గత మ్యాచ్‌ను మర్చిపోయేలా ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాం అని డుప్లెసిస్ తెలిపాడు. కేకేఆర్ మ్యాచ్‌లో తమ వైఫల్యాల గురించి చర్చించామని, అయితే మరీ ఓవర్‌గా దానిపై పని చేయలేదని వివరించాడు. 'మేం మెరుగయ్యే విషయాలపై దృష్టి పెట్టాం. గెలిచినా, ఓడినా ఇలా చేయడం ముఖ్యమని నా భావన. గత మ్యాచ్‌లా భారీ తేడాతో ఓడినప్పుడు మరీ ఎక్కువగా దాని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు' అని తన పంథాను స్పష్టం చేశాడు.