IPL 2023 LSG VS MI : క్రికెట్.. భారత్‌లో ఇది ఆట మాత్రమే కాదు.. అంతకుమించి. ఇంకా చెప్పాలంటే భారత క్రికెట్ ప్రేమికుడికి ఓ ఎమోషనల్. వారి జీవితంలో ఓ భాగం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఖాళీ దొరికితే.. బ్యాట్ పట్టుకొని గ్రౌండ్‌కు పరుగులు పెట్టడం.. వీలు చేసుకుని మరీ మ్యాచ్‌ను వీక్షించడం చేస్తుంటారు. అది అంతర్జాతీయ మ్యాచ్ అయినా లేదా ఐపీఎల్ మ్యాచ్ అయినా. తమ అభిమాన జట్టు గెలిస్తే కేరింతలు కొట్టడం, సంబరపడటం.. అదే ఓడిపోతే బాధ పడటం చేస్తుంటారు.
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు మ్యాచులు ఓడిపోతే అభిమానులు ఏడ్చిన సంఘటనలు చూశాం. అలానే ప్లేయర్స్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టడం చూశాం. కానీ మ్యాచ్‌లో చిందులేసే చీరగర్ల్స్ ఏడవడం అంతగా చూసి ఉండం. తాజాగా మంగళవారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్-ముంబయి ఇండియన్స్ మ్యాచులో ఇది జరిగింది. అసలీ మ్యాచ్‌లో పలు ఆసక్తికర సంఘటనలు జరిగాయి. ఓ దశలో సులభంగా గెలిచేలా కనిపించిన ముంబయి.. వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి ఐదు పరుగులు తేడాతో ఓటమిని అందుకుంది.
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయికి విజయానికి.. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. ఈజీగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. క్రీజులో హిట్టర్లు టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్ ఉండటంతో ముంబయి విజయం లాంఛనమేనని అంతా భావించారు. కానీ కథ రివర్స్ అయింది. లాస్ట్ ఓవర్ వేసిన మోసిన్ ఖాన్ తన అద్భుత యార్కర్లతో 11 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్నాడు. కేవలం 5 పరుగులే ఇచ్చి తన జట్టుకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. ఆ ఒక్క ఓవర్‌తో సెన్సేషన్‌గా మారిపోయాడు. దీంతో ఓటమిని ఖాతాలో వేసుకున్న ముంబయి... ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమితో ముంబయి అభిమానులు నిరాశలోకి వెళ్లిపోయారు. ఇక్కడ మరో విషయమేమిటంటే.. ఫ్యాన్స్‌తో పాటు ముంబయి చీరగర్ల్స్ కూడా అదే మూడ్‌లోకి వెళ్లిపోయారు. అసలు మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ముంబయి బ్యాటర్లు ఔట్ అయిన ప్రతిసారి.. వారి ఎక్స్ప్రెషన్స్ కెమెరా కంటికి చిక్కాయి. వారు ఔట్ అవుతుంటే తెగ ఫీల్ అయిపోయారు! ఒకానొక దశలో ఏడ్చేశారు కూడా. చివరికి రోహిత్ సేన ఓటమిని అందుకున్న సమయంలో వారి మొహాలు వాడిపోయాయి. నిరాశలోకి వెళ్లిపోయారు. ఆ ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇదీ చూడండి:IPL 2023 Mohsin khan : పది రోజులుగా ఐసీయూలో తండ్రి.. బాధను భరిస్తూనే లాస్ట్ ఓవర్ హీరోగా