ఐపీఎల్ సీజన్ 16లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. కొందరు ఆటగాళ్లు కెరీర్లో అత్యుత్తమ రికార్డులు నెలకొల్పుతుంటే.. మరి కొందరు పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో కృనాల్ పాండ్య వచ్చి చేరాడు. రీసెంట్గా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు బాధ్యతలు స్వీకరించిన కృనాల్.. అటు కెప్టెన్‌గా ఇటు బ్యాటర్‌గా రెండింటిలోనూ విఫలమవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో ఫుల్ టైం కెప్టెన్‌గా పరిచయం అయ్యాడు కృనాల్.
ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సిన కృనాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత తన తమ్ముడు హార్దిక్ సారధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ సున్నా చుట్టేశాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడిన మొదటి రెండు మ్యాచుల్లోనూ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరి కెరీర్లో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్ అవ్వడం ఇదే మొదటిసారి.
అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో కృనాల్ 14 పరుగులకే పరిమితమయ్యాడు. ఇలా బ్యాటర్‌గా, మరోవైపు పటిష్ఠంగా ఉన్న జట్టును ముందుకు నడిపించలేక కెప్టెన్‌గా కూడా విఫలమవుతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్రస్తుతం 11 పాయింట్లతో మెరుగైన (3వ) స్థానంలోనే ఉందని చెప్పవచ్చు. ఇకపై ఆడే మూడు మ్యాచ్‌లు లఖ్‌నవూకు ముఖ్యమైనవే. మరి కృనాల్ ఒత్తిడిని అధిగమించి కెప్టెన్‌గా సక్సెఫుల్ కావాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. ఫ్లే ఆఫ్‌కు చేరాలంటే రన్‌రేట్ కూడా కీలకం కానుంది అందుకని కృనాల్ తన ఆటపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆల్ రౌండర్‌గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.