ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చేతులెత్తేశారు. కోల్‌కతా ఘనవిజయం సాధించింది.
కోల్‌కతా నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగింది. ఆరంభంలోనే బెంగళూరుకు షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (21)ని కోల్‌కతా మిస్టరీ బౌలర్ సునీల్ నరైన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత చక్రవర్తి బౌలింగ్‌లో మరో ఓపెనర్ డుప్లెసిస్ (23) క్లీన్‌బౌల్డయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ (5)ను కూడా వరుణ్ చక్రవర్తి క్లీన్‌బౌల్డ్ చేశాడు. హర్షల్ పటేల్ (0)కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం వచ్చిన సునీల్ నరైన్ బౌలింగ్‌లో షహ్బాజ్ (1) భారీ షాట్‌కు యత్నించి శార్దూల్ ఠాకూర్ చేతికి చిక్కాడు. బ్రాస్‌వెల్ జట్టు స్కోర్ బోర్డును పరిగెత్తించే క్రమంలో క్యాచ్ ఔటయ్యాడు. కోల్‌కతా ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ బౌలింగ్‌లో బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ అనుజ్ రావత్ పెవిలియన్‌కు చేరాడు. భారీ షాట్‌కు యత్నించి నరైన్ చేతికి చిక్కాడు. ఎన్నో ఆశలు పెటుకున్న దినేశ్ కార్తీక్(9) నిరాశపరిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. కర్ణ్ శర్మను కూడా ఇంపాక్ట్ ప్లేయర్ సుయాశే పెవిలియన్‌కు పంపాడు. కోల్‌కతా బౌలరల్లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, శార్దుల్ ఠాకూర్ అదరగొట్టారు.
టాస్ ఓడిన కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా వెంకటేశ్ అయ్యర్, రహ్మనుతుల్లా గుర్బాజ్ శుభారంభం చేశారు. అయితే ఆరంభంలోనే కోల్‌కతాకు ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ విల్లే వరుస బంతుల్లో (3.2, 3.3వ ఓవర్) రెండు వికెట్లు తీశాడు. తొలుత వెంకటేశ్ అయ్యర్ (3).. తర్వాత మన్దీప్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 26 పరుగుల వద్దే కోల్‌కతా రెండు వికెట్లను చేజార్చుకుంది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నితీశ్ రాణా (1) మరోసారి నిరాశపరిచాడు. బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి కీపర్ కార్తిక్ చేతికి చిక్కాడు. తొలుత అంపైర్ నాటౌట్‌గా ప్రకటించగా.. ఆర్సీబీ డీఆర్ఎస్ తీసుకుని సఫలమైంది.