ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జోరు కొనసాగిస్తోంది. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను మట్టికురిపించింది. రహానె (71 నాటౌట్), శివమ్ దూబె (50), కాన్వే (56) మెరవడంతో మొదట చెన్నై 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు చేసింది. జేసన్ రాయ్ (61), రింకూ సింగ్ (53 నాటౌట్) గట్టి ప్రయత్నమే చేసినా ఛేదనలో కోల్‌కతా 8 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. ఏడు మ్యాచ్‌ల్లో అయిదో విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి.
జేసన్, రింకూ మెరిసినా..: ఒక్క పరుగుకే రెండు వికెట్లు. ఎనిమిదో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ (20) ఔటయ్యేప్పటికి 46. చాలా పెద్ద లక్ష్య ఛేదనలో మెరుపు ఆరంభం అవసరమైన కోల్‌కతా పరిస్థితి. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ దాదాపు 15. ఇక ఆ జట్టుకు కష్టమే అనిపించింది. కానీ వీరబాదుడు బాదిన జేసన్ రాయ్ కోల్‌కతాను రేసులో నిలిపాడు. అతడు ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు బాదడంతో ఆ జట్టు 14.2 ఓవర్లలో 135/4తో చెన్నైని కలరవర పెట్టింది. అయితే తీక్షణ అతడి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. రాయ్.. రాణా (20)తో నాలుగో వికెట్‌కు 24, రింకూతో అయిదో వికెట్‌కు 65 పరుగులు జోడించాడు. రాయ్ ఔటైనా.. రింకూ జోరు పెంచడం, మరో విధ్వంసకారుడు రసెల్ క్రీజులో ఉండడంతో.. కోల్‌కతా చివరి అయిదు ఓవర్లలో 99 పరుగులు చేయాల్సి ఉన్నా చెన్నై ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. రింకూ జోరుతో 16వ ఓవర్లో 19 పరుగులొచ్చాయి. బౌండరీల మోతకు తెరిపినిస్తూ చక్కగా బౌలింగ్ చేసిన పతిరన 17వ ఓవర్లో ఎనిమిది పరుగులే ఇచ్చి రసెల్‌ను ఔట్ చేయడంతో చెన్నై ఊపిరిపీల్చుకుంది. చివరి మూడు ఓవర్లలో 72 పరుగులు చేయాల్సిన స్థితిలో కోల్‌కతా ఓటమి దాదాపుగా ఖాయమైంది. 18వ ఓవర్లో తుషార్ 13 పరుగులే ఇచ్చి వీజ్‌ను ఔట్ చేయడంతో ఆ జట్టు ఓటమి లాంఛనమే అయింది.