గౌతమ్ గంభీర్-విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఐపీఎల్లో వీరిద్దరూ తమ చర్యలతో చర్చనీయాంశంగా మారారు. అందుకు కారణం.. తాజాగా లఖ్‌నవూ-ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకరిమీదకు ఇంకొకరు వెళ్తూ గొడవపడటమే. అయితే వీరిద్దరు గొడవపడటం కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఇలానే వాగ్వాదానికి దిగారు.
మొదట బాగానే ఉన్నా ఆ తర్వాతే.. వాస్తవానికి వీరిద్దరూ దిల్లీ నుంచి వచ్చిన వారే. మైదానంలో దిగారంటే విజయమే లక్ష్యంగా దూకుడుగా ఆడుతారు. ఆటలోనే కాదూ వ్యక్తిగతంగా కూడా దూకుడుగానే వ్యవహరిస్తుంటారు. ఒకప్పుడు వీరిద్దరి మధ్య బాండింగ్ ఉండేదనే చెప్పాలి. మంచి మధురజ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఓ సందర్భంలో గంభీర్ తనకు వచ్చిన 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కూడా తన జూనియర్ కోహ్లీకి ఇవ్వాలని వేదికపైనే విజ్ఞప్తి చేశాడు. 2009లో శ్రీలంకతో జరిగిన వన్డేలో ఈ ఇద్దరు కలిసి 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఆ మ్యాచ్‌లో లంక విసిరిన 316 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా ఈజీగా ఛేదించింది. గంభీర్ 150 పరుగులు చేస్తే.. కోహ్లీ 107 పరుగులు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి అదే ఫస్ట్ సెంచరీ కావడం విశేషం. విరాట్.. ఎంతో టాలెంట్ ప్లేయర్ అని.. భవిష్యత్తులో 100 సెంచరీలు పూర్తి చేస్తాడని గంభీర్ అప్పట్లోనే ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే అప్పటికే గంభీర్ టీమ్‌లో సీనియర్ ఆటగాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో 54 బంతుల్లో 75 పరుగులు చేసి భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
తొలిసారి అప్పుడే.. 2013లో తొలిసారి ఓ ఐపీఎల్ మ్యాచులో వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఆ ఏడాది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ-కేకేఆర్ జట్లు మధ్య మ్యాచ్ జరగగా.. బెంగళూరుకు కోహ్లీ కెప్టెన్‌గా ఉండగా.. కేకేఆర్‌కు గంభీర్ నాయకత్వం వహించాడు. అయితే బెంగళూరు విజయానికి 11 ఓవర్లలో 80 పరుగులు అవసరమైన సమయంలో... కోల్‌కతా బౌలర్ బాలాజీ బంతిలో కోహ్లీ పెవిలియన్ చేరాడు. దీంతో కేకేఆర్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సమయంలో డగౌట్‌కు వెళ్తున్న కోహ్లీకి.. గౌతమ్ గంభీర్ వైపు నుంచి ఏవో కామెంట్స్ వినిపించాయి. అంతే విరాట్ కోహ్లీ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అలా కోహ్లీ-గంభీర్ మధ్య గొడవ మొదలైంది. అక్కడే ఉన్న మిగతా ప్లేయర్స్ వారిని అడ్డుకున్నారు.
రెండోసారి.. 2016లో మరోసారి వీరిద్దరి ఐపీఎల్‌లోనే వాగ్వాదానికి దిగారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 183 పరుగులు చేసింది. గంభీర్ 34 బంతుల్లో 51 రన్స్ చేశాడు. లక్ష్యఛేదనకు దిగిన ఆర్సీబీ విజయం దిశగా సాగింది. అప్పటికే విరాట్ క్రీజులో ఉన్నాడు. 19వ ఓవర్లో కోహ్లీ పరుగు తీసి నాన్‌స్ట్రైకర్ వైపు చేరుకున్నాడు. అయితే అప్పుడు గంభీర్ దూకుడుగా.. బంతిని కోహ్లీవైపు విసిరాడు. ఇది వారిద్దరి మధ్య మరోసారి వివాదానికి దారితీసింది.
పలు సందర్భాల్లో.. గతేడాది దాదాపు మూడు సంవత్సరాలు(1,020 రోజులు) తర్వాత కోహ్లీ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. దీనిపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "కోహ్లీ ప్లేస్‌లో ఇంకెవరైనా టీమ్‌లో ఉండి.. మూడేళ్లపాటు సెంచరీ చేయకపోతే అతడు టీమ్‌లో కొనసాగేవాడు కాదు" అని అన్నాడు. అలా గంభీర్ చాలా సార్లు.. విరాట్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు.
కోహ్లీ పోస్ట్.. అయితే తామిద్దరి మధ్య.. వ్యక్తిగత వైరం లేదని.. కేవలం మైదానంలో మాత్రమే ఉంటుందని గంభీర్ 2016లోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మైదానం బయట కోహ్లీ తనకు మంచి ఫ్రెండ్ అని కూడా అన్నాడు. ఇకపోతే తాజాగా గొడవ తర్వాత.. కోహ్లీ ఓ పోస్ట్ పెట్టాడు. "మనం వినేదంతా అభిప్రాయం మాత్రమే.. నిజం కాదు. మనం చూసేదంతా దృష్టికోణం మాత్రమే.. నిజం కాదు" అని ఓ కొటేషన్ రాసుకొచ్చాడు. గంభీర్‌తో జరిగిన గొడవకు జరిగిన సమాధానమే ఈ పోస్ట్ అని అంతా అనుకుంటున్నారు.
భారత క్రికెట్‌లో కొందరి ప్లేయర్స్ మధ్య ఇలాంటి కొన్ని వివాదాలు కాంట్రవర్సీలుగా మారాయి.