ఐపీఎల్ 16వ సీజన్‌లో కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ ప్రస్తుతం స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో.. గత రెండు మ్యాచుల నుంచి డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు. కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే చేస్తున్నాడు. అయితే తాజాగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ డుప్లెసిస్ మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలో దిగగా.. కోహ్లీ మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన కోహ్లీ.. ఈసారి మాత్రం గెలిచాడు. ఈ క్రమంలో ఆర్సీబీ సారథిగా 580 రోజుల తర్వాత టాస్ నెగ్గాడు. విరాట్ ఆఖరిసారిగా 2021 ఐపీఎల్‌లో కోల్‌కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ నెగ్గాడు. ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న అతడు.. తాజాగా ఈ సీజన్‌లో మళ్లీ అదే కోల్‌కతా మ్యాచ్‌లోనే తాత్కాలిక కెప్టెన్‌గా టాస్ నెగ్గాడు.
ఆర్సీబీ దారుణ ఫీల్డింగ్.. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు దారుణంగా ఫీల్డింగ్ చేసింది. ఆర్సీబీ చెత్త ఫీల్డింగ్ వల్ల.. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా మూడుసార్లు ఔటయ్యే ఛాన్స్ నుంచి తప్పించుకున్నాడు. మొదట నితీష్ 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు విజయ్‌కుమార్ బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా షాట్ ఆడాడు. అయితే సిరాజ్.. చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. రెండోసారి సిరాజ్ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్ దిశగా ఆడాడు. అప్పుడు అక్కడే ఉన్న ఫీల్డర్ మరోసారి క్యాచ్‌ను వదిలేశాడు. ముచ్చటగా మూడోసారి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రానా లాంగాన్ దిశగా షాట్ బాదగా.. మ్యాక్స్‌వెల్ క్యాచ్‌ను జాడవిరిచాడు. ఇలా మూడుసార్లు ఔటయ్యే ఛాన్స్ నుంచి తప్పించుకున్నాడు.