ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. టీమ్ఇండియా దిగ్గజం సునీల్ గావస్కర్.. ధోనీని ఆటోగ్రాఫ్ అడగడం ఆసక్తిగా మారింది. ఈ అరుదైన దృశ్యం మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగింది. సునీల్ గావస్కర్ స్వయంగా మహీ వద్దకు వెళ్లి మరీ ఆటోగ్రాఫ్ అడిగాడు. ఓ దిగ్గజ క్రికెటర్ ఆటోగ్రాఫ్ అడిగితే మహీ మాత్రం కాదంటాడా. గావస్కర్ షర్ట్ ముందు భాగంపై తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత ధోనీని.. సునీల్ గావస్కర్ హార్ట్ ఫుల్‌గా హత్తుకున్నాడు. ఇదంతా అక్కడ ఉన్న అభిమానులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అంతకముందు కేకేఆర్ ప్లేయర్ రింకూ సింగ్ కూడా ధోనీ ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాడు. పుట్టినప్పటి నుంచి ధోనీ ఆట చూస్తూ పెరిగిన అతడు.. తన అభిమాన ప్లేయర్‌కు ప్రత్యర్థిగా ఆడడమే కాకుండా 50 స్కోరుతో కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత.. మహీతో కలిసి కాసేపు ముచ్చటించాడు రింకూ. విలువైన సలహాలను తీసుకున్నాడు. అనంతరం తన జెర్సీపై ఆటోగ్రాఫ్ అడిగి పెట్టించుకున్నాడు.
జడ్డూ ఔట్.. సీన్ రివర్స్.. సాధారణంగా ఐపీఎల్లో చెన్నై ఆడే ప్రతీ మ్యాచ్‌కు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివస్తారు. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చూడటం కోసమే వస్తుంటారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహీ బ్యాటింగ్‌కు వచ్చి ఒక్క బంతి ఆడినా.. ఆనందంతో మురిసిపోతారు. అయితే అతడి బ్యాటింగ్ కోసం ఎంతలా ఎదురుచూస్తారన్నదానికి.. తాజాగా జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన జడేజా.. వైభవ్ అరోరా బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే చెన్నై ఇన్నింగ్స్‌కు కేవలం రెండు బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే సాధారణంగా ఏ మ్యాచులోనైనా.. మద్దతిస్తున్న జట్టుకు చెందిన బ్యాటర్ ఔటైతే బాధపడడం చూస్తాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. జడ్డూ ఔట్ అవ్వగానే స్టేడియం హోరెత్తిపోయింది. ఎందుకంటే జడ్డూ ఔట్ అయితేనే ధోనీ ఎంట్రీ ఇస్తాడు. అంతే ఇక మహీ ఎంట్రీతో స్టేడియం మొత్తం అతడి నామసర్మణతో దద్దరిల్లిపోయింది. అయితే మహీ రెండు పరుగులు చేశాడు.