తెలంగాణ

telangana

ETV Bharat / sports

MI Vs GT Match Preview : ముంబయి × గుజరాత్‌​.. చెన్నైని ఢీకొట్టేదెవరో? - ఐపీఎల్​ 2023 మ్యాచ్​

ఐపీఎల్‌- 16 సీజన్​లో భాగంగా జరగుతున్న ప్లేఆఫ్స్‌ సమరం ఇప్పుడు చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు మారింది. శుక్రవారం జరగనున్న రెండో క్వాలిఫయర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో అయిదు సార్లు విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌ పోటీపడనుంది.

gujrat titans vs mumbai indians qualifier 2 match preview
gujrat titans vs mumbai indians

By

Published : May 26, 2023, 7:52 AM IST

MI Vs GT Qualifier 2 : భిన్న దారుల్లో లీగ్‌ దశ దాటిన రెండు జట్లకు.. ప్లేఆఫ్స్‌లోనూ భిన్న ఫలితాలు ఎదురయ్యాయి. లీగ్‌ దశలో 10 విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన టైటాన్స్‌.. తొలి క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో ఓటమిపాలవ్వగా.. ఎనిమిది విజయాలతో కష్టపడి ముందంజ వేసిన ముంబయి ఎలిమినేటర్‌లో లఖ్‌నవూపై అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ రెండు జట్లు ఫైనల్స్​లో స్థానం కోసం తలపడుతున్నాయి. బలాబలాల పరంగా చూస్తే.. ఈ రెండు జట్లు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి.

వరుసగా రెండు ఓటములతో సీజన్‌ను ఆరంభించి.. ఎన్నో ఆటుపోట్లను దాటి.. ముంబయి ఫైనల్‌కు అడుగు దూరంలో నిలవడం ఆ జట్టు పట్టుదల, పోరాట పటిమకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతానికి ఆ జట్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు తమ సంచలన ప్రదర్శనతో మైదానంలో చెలరేగుతున్నారు. ఒకరేమో పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ కాగా.. మరొకరు ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌. మందకొడిగా కనిపించిన చెన్నై పిచ్‌పైనే లఖ్‌నవూతో జరిగిన పోరులో గ్రీన్‌.. తన బ్యాట్‌తో సత్తాచాటగా.. ఆకాశ్‌ ఏకంగా అయిదు వికెట్లతో విజృంభించాడు. దీంతో 81 పరుగుల భారీ తేడాతో విజయాన్ని మద్దాడింది ముంబయి టీమ్​. ఇక సన్‌రైజర్స్‌పై శతకంతో అదరగొట్టిన గ్రీన్‌, గత మ్యాచ్‌లోనూ విలువైన పరుగులను సాధించాడు. ఇక సూర్యకుమార్‌ యాదవ్​ కూడా జోరు మీదున్నాడు. నేహాల్‌ వధెరా కూడా రాణిస్తున్నాడు.

కాస్త విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన తిలక్‌ వర్మతో పాటు రోహిత్‌ శర్మ, ఇషాన్‌, టిమ్‌ డేవిడ్​లతో కూడిన ముంబయి జట్టు... బ్యాటింగ్‌ పరంగా పటిష్టంగా ఉంది. అయితే ఈ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కట్టడి చేయడం అనేది గుజరాత్‌ బౌలింగ్‌ దళానికి సవాలనే చెప్పాలి. ఏ ముగ్గురు ఆటగాళ్లు పరుగుల వేటలో విజయవంతమైనా సరే.. ఇక టైటాన్స్‌కు ఇబ్బందులు తప్పవు. మరోవైపు ఐపీఎల్‌లో ప్రమాదకర రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో సూర్య ఒక్కసారి కూడా ఔటవలేదు. రషీద్‌పై సూర్య ఆధిపత్యానికి అలా ఉంది మరి.

ఇక ముంబయి బౌలర్లలో యువ సంచలనం ఆకాశ్‌ గురించి నెట్టింట వస్తున్న రెస్పాన్స్​ అంతా ఇంతా కాదు​. సన్‌రైజర్స్‌తో జరిగిన పోరులో నాలుగు వికెట్లను పడగొట్టి జట్టు ప్లేఆఫ్స్‌ చేరడానికి కీలక పాత్ర పోషించిన అతను.. లఖ్‌నవూపై 3.3-0-5-5 బౌలింగ్‌ గణాంకాలతో అందరిని అబ్బురపరిచాడు. జోర్డాన్‌ కూడా ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శనే చూపించాడు. వీళ్లతో పాటు వెటరన్‌ స్పిన్నర్‌ పియూశ్​ చావ్లా, బెరెన్‌డార్ఫ్‌ కూడా సత్తాచాటుతున్నారు. ఇక ఈ బౌలింగ్‌ విభాగం రాణిస్తే ముంబయికి తిరుగుండదు. లఖ్‌నవూపై విజయం ముంబయి టీమ్​ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. స్టార్‌ ఆటగాళ్లు దూరమైనా.. సమష్టి ప్రదర్శనతో మైదానంలో సత్తా చాటగలమంటూ.. ప్రత్యర్థి టీమ్​కు హెచ్చరిక జారీ చేసింది.

లీగ్‌ దశను గొప్పగా ముగించిన గుజరాత్‌.. చెన్నైతో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కంగుతింది. బ్యాటర్లు విఫలమవడం వల్ల ఆ జట్టు ఓటమి పాలైంది. దీంతో లోపాలు సరిదిద్దుకుని ఫైనల్‌ చేరడానికి రెండో అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే సంకల్పంతో ఉంది. మరోవైపు బ్యాటింగ్‌ పరంగా చూస్తే ఆ జట్టు యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై ప్లేయర్లు అతిగా ఆధారపడినట్లు కనిపిస్తోంది. సంచలన ఫామ్‌లో ఉన్న గిల్‌ ఇప్పటికే రెండు శతకాలను బాదేశాడు. 15 మ్యాచ్‌ల్లో 722 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో డుప్లెసిస్‌ (730) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. కానీ అతను నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. మిగతా బ్యాటర్ల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది.

ఇక గిల్‌ తర్వాత టైటాన్స్‌లో అత్యుత్తమ బ్యాటింగ్‌ ప్రదర్శన విజయ్‌ శంకర్‌ (301)దే. అతని కంటే గిల్‌ 421 పరుగులు ఎక్కువ చేయడం గమనార్హం. దీన్ని బట్టి ఆ జట్టులో మిగతా బ్యాటర్ల ప్రదర్శన ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యతో పాటు మిల్లర్‌, సాహా, తెవాతియా బ్యాట్‌తో మెరిస్తేనే.. ఇక టైటాన్స్‌ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలింగ్‌లో పేసర్‌ షమితో పాటు అఫ్గాన్‌ స్పిన్నర్లు రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌.. మ్యాచుల్లో నిలకడగా రాణిస్తున్నారు. దాదాపు 15 మ్యాచ్‌ల్లో 26 వికెట్లతో షమి, 25 వికెట్లతో రషీద్‌.. అత్యధిక వికెట్లు తీసిన వీరుల జాబితాలో వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముంబయి బ్యాటర్లకు, గుజరాత్‌ బౌలర్లకు మధ్య రసవత్తర పోరు ఖాయం. మరి ముంబయి ఏడో సారి టైటిల్‌ పోరు చేరుతుందా? లేదా టైటాన్స్‌ వరుసగా రెండో సారి ఆఖరి సమరానికి సై అంటుందా? అన్నది వేచి చూడాల్సిందే.

తుది జట్లు (అంచనా):
ముంబయి ఇండియన్స్‌:రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్​, ఇషాన్‌, కామెరున్​ గ్రీన్‌, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్‌, జోర్డాన్‌, షోకీన్‌/నేహాల్‌, ఆకాశ్‌, చావ్లా, బెరెన్‌డార్ఫ్‌.

గుజరాత్‌ టైటాన్స్‌:విజయ్‌ శంకర్‌, సాహా, హార్దిక్‌ పాండ్య, శుభ్‌మన్‌ గిల్​, మిల్లర్‌, సుదర్శన్‌/అభినవ్‌ మనోహర్‌, రషీద్‌ ఖాన్‌, రాహుల్‌ తెవాతియా, నూర్‌ అహ్మద్‌, మోహిత్‌ శర్మ, షమి

ABOUT THE AUTHOR

...view details