బ్యాటింగ్ ఇలా కూడా చేస్తారా.. షాట్లు ఇలా కూడా కొడతారా.. అసలు ఈ షాట్లకు ఏమని పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు.. అని అంటున్నారు క్రికెట్ అభిమానులు. అర్థం కాలేదా.. 'స్కై' సూర్యకుమార్ యాదవ్ ఆటతీరును చూసిన క్రికెట్ ప్రియులందరికీ మదిలో మెదిలిన సందేహాలు ఇవి. దశాబ్దాలుగా క్రికెట్ ఆడిన వారికి.. అలానే క్రికెట్‌ను అనుసరిస్తూ ఎన్నో బ్యాటింగ్ విన్యాసాలను చూసిన వారికి కూడా.. సూర్య బ్యాటింగ్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. వారికి అతడు బాదే షాట్లు చూస్తుంటే చిత్రాతి చిత్రంగా కనిపిస్తోంది.
'స్కై'కు మాత్రమే సాధ్యం.. వాస్తవానికి క్రికెట్లో టీ20 ఫార్మాట్ ఊపందుకున్నాక క్రికెటర్లు స్కూప్, ర్యాంప్ షాట్లను బాదడం ఎన్నో చూశాం. ఒంటిని విల్లులా వంచుతూ.. క్రీజులో నాట్యం చేస్తూ 360 డిగ్రీల కోణంలో షాట్లు ఆడే డివిలియర్స్ ఆటతీరును చూసి.. ఇలాంటోడు ఇంకొకడు రావడం కష్టమే అనుకున్నాం. అసలు అలాంటి ప్లేయర్ రాడనే అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సూర్య వచ్చి మిస్టర్ 360 ప్లేయర్‌గా ఊచకోత కోస్తున్నాడు. ఏబీనే మించిన 360 డిగ్రీ ఆటతో.. క్రికెట్ మైదానాన్ని హోరెత్తిస్తున్నాడు. సచిన్, గంగూలీ లాంటి మాజీ ప్లేయర్స్.. కోహ్లీ, బట్లర్ లాంటి సమకాలీన స్టార్ క్రికెటర్లు కూడా.. సూర్య బ్యాటింగ్‌కు ఫిదా అయిపోతున్నారు. వారు ఆశ్చర్యపోతూ.. ఇలా ఆడటం 'స్కై' ఒక్కడికే సాధ్యం అవుతుందని ప్రశంసిస్తున్నారు.
200 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. అయితే ఆ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్లో కాస్త తడబడి, ఫామ్ కోల్పోయిన సూర్య.. ఈ ఐపీఎల్‌ను కూడా నెమ్మదిగానే ప్రారంభించాడు. వరుసగా డకౌట్లు కూడా అయి తీవ్రంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. సోషల్‌మీడియాలో అతడిపై ఫుల్ ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడతడు లయ అందుకున్నాక.. అతడిని ఆపడం ప్రత్యర్థులకు కష్టమవుతోంది. ఈ మెగాలీగ్ మొదట్లో డకౌట్లుగా వెనుదిరిగిన అతడు.. తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లో 57 (26 బంతుల్లో), 23 (12), 55 (29), 66 (31), 26 (22), 83 (35).. ధనాధన్ బాదాడు. దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థుల బౌలింగ్‌ను ఊచకోత కోశాడు.