గుజరాత్ టైటాన్స్ మళ్లీ మెరిసింది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. వరుసగా రెండో విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తొలుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఆ జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రాణించింది. పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయినా.. రన్‌రేట్ మాత్రం తగ్గకుండా చూసుకుంది. గత మ్యాచ్‌లో 'ఇంపాక్ట్ ప్లేయర్'గా ఆడి, ఈసారి తుది జట్టులో చోటు దక్కించుకున్న తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్ (62 నాటౌట్; 48 బంతుల్లో 4×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఛేదించింది. ఫలితంగా దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌కు గుజరాత్ కళ్లెం వేసింది. అయితే వరుసగా వికెట్లను చేజార్చుకున్న దిల్లీ.. అక్షర్ పటేల్ దూకుడుతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ వార్నర్ 37 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 30 పరుగులు చేశారు. చివర్లో అక్షర్ పటేల్ 36 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.