ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (47; 37 బంతుల్లో 6x4), కెప్టెన్ హార్దిక్ పాండ్య (66; 50 బంతుల్లో 2x4, 4x6) రాణించారు. ఇక శుభ్‌మన్ గిల్ డకౌట్ కాగా విజయ్ శంకర్ (10), అభినవ్ మనోహర్ (3), మిల్లర్ (6) విఫలమయ్యారు.
అయితే వీరు తమ ఇన్నింగ్స్ ఆరంభంలో చాలా నిదానంగా ఆడారు. దీంతో మ్యాచ్‌ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు విసుగు వచ్చింది. ముఖ్యంగా హార్దిక్.. ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటింగ్ చేసిన విధానం మరీ స్లోగా అనిపించింది. వికెట్ స్లోగా ఉన్నప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఏముందని ఫ్యాన్స్ అడుగుతున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్‌ను చూస్తుంటే టెస్ట్ మ్యాచులా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో మాత్రం హార్దిక్ దూకుడు ప్రదర్శించకపోతే.. ఐపీఎల్ హిస్టరీలో అత్యంత స్వల్ప స్కోర్ నమోదయ్యేది అని చెబుతున్నారు. వాస్తవానికి ఈ స్లో ట్రాక్‌పై పరుగులు చేయడం చాలా ఇబ్బందిగా ఉండడంతోనే హార్దిక్.. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడాల్సి వచ్చింది. సాహా వేగంగా పరుగులు చేద్దామనుకున్నా కుదరలేదు. ఈ క్రమంలోనే అతడు ఔటయ్యాడు. ఇక గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయడంలో లఖ్‌నవూ బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. నవీన్ ఉల్ హాక్ (4-0-19-1), కృనాల్ పాండ్య (4-0-16-2), స్టోయినిస్ (3-0-20-2), అమిత్ మిశ్రా (2-0-9-1) మంచిగా బంతులు సంధించారు.