ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. అయితే సీఎస్కే బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (60; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ బాదగా.. డేవాన్ కాన్వే (40; 34 బంతుల్లో 4 ఫోర్లు) నెమ్మదిగా ఆడాడు. అజింక్య రహానె (17; 10 బంతుల్లో), అంబటి రాయుడు (17; 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) దూకుడు ప్రదర్శించినప్పటికీ.. ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. శివమ్ దూబె (1), ధోనీ (1) నిరాశపరిచారు. ఆఖర్లో రవీంద్ర జడేజా (22; 16 బంతుల్లో 2 ఫోర్లు), మొయిన్ అలీ (9; 4 బంతుల్లో 1 సిక్స్) నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు, మహ్మద్ షమి రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ఖాన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
నో బాల్ అదష్టం.. అయితే ఈ పోరు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే చెన్నై ఓపెనర్ రుతురాజ్‌కు నో బాల్ అదృష్టం కలిసి రావడంతో ఔట్ అవ్వకుండా తప్పించుకున్నాడు. క్రీజులోకి వచ్చి అతడు 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. దర్శన్ నల్కండే బౌలింగ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి ఔటయ్యే పరిస్థితి నుంచి తప్పించుకున్నాడు. రుతురాజ్.. థర్డ్ బాల్‌ను మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న గిల్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో రుతురాజ్ వెనుదిరగగా.. ఫస్ట్ వికెట్ దక్కిందన్న సంతోషంలో దర్శన్ నల్కండే ఉండిపోయాడు. అయితే మరుక్షణమే ఆ సంతోషం ఆవిరైపోయింది. అంపైర్ దాన్ని నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో రుతురాజ్ ఊపిరి పీల్చుకొని మళ్లీ క్రీజులోకి వెళ్లాడు. అలా నోబాల్ అవ్వడంతో ఔట్ అవ్వకుండా బతికిపోయిన గైక్వాడ్.. ఆ తర్వాత 60 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అంటే ఆ ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు అన్నమాట.