CSK VS GT Final : దాదాపు రెండు నెలలపాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. గుజరాత్‌తో ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి ఐదో సారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. గుజరాత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన చివరి బంతికి విజయం సాధించింది. చివరి ఓవర్ (మోహిత్ శర్మ)లో 13 పరుగులు అవసరం కాగా.. మొదటి నాలుగు బంతుల్లో మూడే పరుగులు వచ్చాయి. దీంతో చివరి రెండు బంతులు సమీకరణం 10 పరుగులుగా మారింది. దీంతో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో చెన్నై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతం చేశాడు. జడ్డూ వరుసగా సిక్స్, ఫోర్ బాదడం వల్ల చెన్నై శిబిరం ఆనందంలో మునిగితేలింది.
IPL 2023 Winner : మొదటి రోజు వర్షం పడటం వల్ల మ్యాచ్‌ను రిజర్వ్‌డేకు వాయిదా వేశారు. అయితే సోమవారం మొదటి ఇన్నింగ్స్ సాఫీగానే సాగినా.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సరికి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
171 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఓపెనర్లు డేవన్ కాన్వే(47: 25 బంతుల్లో 2x6,4 x4), రుతురాజ్ గైక్వాడ్(26: 16 బంతుల్లో 3x4, 1x6) మంచి శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు ఈ జోడి 6.3 ఓవర్లలో 74 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి ఓవర్ నుంచే విరుచుకుపడిన ఈ ప్లేయర్లు ఫోర్లు, సిక్సర్‌లతో గుజరాత్ బౌలర్లను ఆటాడుకున్నారు. శివమ్ దూబె(32: 21 బంతుల్లో 2x6)తో జట్టు కట్టిన అజింక్యా రహానె(27*: 13 బంతుల్లో 2x6, 2x4) అద్భుతంగా ఆడాడు. ఉన్నంత సేపు సిక్స్‌లు, ఫోర్లతో అలరించాడు. రాయుడు(19) కూడా మెరుపు షాట్లు ఆడి రాణించాడు. ఇక, గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లతో చెలరేగిపోగా. నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. తొలి డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ (96; 47 బంతుల్లో 8×4, 6×6) చెలరేగి ఆడటంతో గుజరాత్ భారీ స్కోరే చేసింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (54; 39 బంతుల్లో 5×4,1×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. శుభ్‌మన్ గిల్ (39; 20 బంతుల్లో 7×4) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లలో పతిరణ 2 వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ చెరో వికెట్ తీశారు.