ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కార్తిక్.. ఐదు బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన అతడు వరుసగా 0,9,1*,0,28,7 పరుగులు మాత్రమే చేశాడు. అంటే మొత్తంగా ఆరు మ్యాచ్‌లు కలిపి కేవలం 45 పరుగులు మాత్రమే తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. ఈ గణాంకాలు చూస్తే.. ఒక మ్యాచ్‌లో చివర్లో బ్యాటింగ్‌కు దిగి ఒక్క పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. కానీ మిగతా ఐదు మ్యాచ్‌ల్లోనూ మాత్రం తన స్థాయికి తగ్గ ఏమాత్రం ప్రదర్శన చేయలేక చతికిల పడ్డాడు.
వాస్తవానికి దినేశ్ కార్తిక్.. బెంగళూరు జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది ఫినిషర్ పాత్ర కోసం. గత సీజన్‌లో అతడు 16 మ్యాచుల్లో 330 పరుగులు చేసి.. మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అతడికి ఏకంగా టీ20 ప్రపంచకప్‌లోనూ చోటు దక్కింది. కానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. పెద్దగా రాణించలేక విమర్శలను ఎదుర్కొన్నాడు. సర్లే.. కనీసం ఐపీఎల్‌లోనైనా తన ఫినిషర్ రోల్‌ను సమర్థవంతంగా పోషిస్తాడనుకుంటే అదీ లేదూ.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచులో కార్తిక్ 14 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అసలప్పటికే డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌లు మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడి.. ఆర్సీబీని రేసులో ఉంచారు. కానీ స్వల్ప వ్యవధిలో ఇద్దరు పెవిలియన్ చేరారు. దీంతో క్రీజులోకి వచ్చిన కార్తిక్.. ఆరంభంలో కాస్త దూకుడు ప్రదర్శించినప్పటికీ చివరి వరకు క్రీజులో నిలబడలేకపోయాడు. అసలు ఫినిషర్ అంటే చివరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను పూర్తి చేయగలగాలి. అది ఎలాంటి మ్యాచ్ అయినా. కానీ కార్తిక్ అస్సలు ఆ ఫార్ములానే మర్చిపోయినట్టున్నాడు. లక్ష్యాన్ని ఛేదించాలనే కసితో ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్‌ను పోగొట్టుకుంటున్నాడు. అందుకే సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమిపాలైంది.
ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కార్తిక్ అదే పేలవ ప్రదర్శనను కంటిన్యూ చేశాడు. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్‌లు 16 ఓవర్లలో 137/0తో మంచి ఇన్నింగ్స్‌ను నమోదు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ పెవిలియన్ చేరారు. ఆ దశలో ఆర్సీబీకి ఇంకా మూడు ఓవర్లు మిగిలే ఉండటంతో.. క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడు కార్తిక్. కానీ ఫినిషర్ అనేవాడు.. ఆఖర్లో తక్కువ ఓవర్లు ఉంటే హిట్టింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ కార్తిక్ అలా చేయలేదు. మెల్లిగా ఆడాడు. ఆడిన ఐదు బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి ఔటైపోయాడు. దీంతో అభిమానులు అతడిపై విమర్శలు చేస్తున్నారు. సోషల్‌మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. 'కార్తిక్ తన పాత్ర ఏంటో మరిచిపోయినట్లున్నాడు.. గుర్తుచేయాల్సిన అవసరం వచ్చింది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:'ధోనీ నుంచి అది దొంగిలిస్తా.. నా ఆల్‌టైమ్ ఐపీఎల్ ఫేవరెట్ ప్లేయర్ అతడే'