ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. వీటిలో ఓ చెత్త రికార్డు కూడా ఉంది. అదేంటంటే.. ముంబయి బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఆర్సీబీ తరఫున 19వ ఓవర్ వేసిన బౌలర్ సిరాజ్.. ఏకంగా 5 వైడ్ బాల్స్ సంధించాడు. దీంతో ఈ ఐపీఎల్ హిస్టరీలో ఆ ఓవర్ ఓ చెత్త రికార్డుగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఈ ఐపీఎల్ సీజన్లో తన తొలి మ్యాచ్‌లోనే సిరాజ్ ఇలా ఆడటం అందిరినీ షాక్‌కు గురి చేసింది. 19వ ఓవర్లో తొలి రెండు బంతుల్లో 0,1 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు వైడ్ బాల్స్ వేశాడు. మూడో బంతికి 2, నాలుగో బంతికి 4 పరుగులు వచ్చాయి. అనంతరం మరో వైడ్ వేశాడు. ఐదో బంతికి 4, ఆరో బంతికి 0 పరుగులు వచ్చాయి. ఇలా సిరాజ్ తన ఓవర్‌ను(0, 1, Wd, Wd, Wd, Wd, 2, 4, Wd, 4, 0) ముగించాడు. మొత్తంగా అతడి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. అయితే ముంబయి పవర్‌ప్లేలో మాత్రం సిరాజ్ మంచి బౌలింగ్ వేశాడు. ప్రత్యర్థి బ్యాటర్లను బాగానే కట్టడి చేశాడు. పవర్ ప్లేలోని ఆరు ఓవర్లలో మూడు ఓవర్లను సిరాజ్ సంధించగా.. వాటిలో 5 పరుగులు మాత్రమే వచ్చాయి.
దినేశ్ కార్తీక్ ప్రపంచ రికార్డు.. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఓ ప్రపంచ రికార్డును సాధించాడు. ఈ సీజన్ తన ఆరంభ మ్యాచ్‌లోనే అతడు ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(1) దినేశ్ కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ క్యాచ్‌తో టీ20 క్రికెట్లో 200 క్యాచ్‌లు పట్టుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇకపోతే ఈ ఘనత సాధించిన భారత రెండో వికెట్ కీపర్‌గానూ నిలిచాడు. ఇతడికి కన్నా ముందు.. టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌కీపర్‌గా దక్షిణాఫ్రికా ప్లేయర్ క్వింటన్ డి కాక్.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతడు ఇప్పటివరకు మొత్తం 207 క్యాచ్‌లను అందుకున్నాడు. రెండో స్థానంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. ఇప్పుడు దినేశ్ కార్తీక్.. 200 క్యాచ్‌లను పూర్తి చేసిన నేపథ్యంలో ప్రపంచ క్రికెట్లో మూడో వికెట్ కీపర్‌గా నిలిచాడు.