IPL 2023 Dhoni : ఎప్పుడూ లేని విధంగా ఈ ఐపీఎల్ సీజన్ ధోనీ నామస్మరణతో మార్మోగిపోయింది. అతడికి ఇదే చివరి సీజన్ అంటూ ప్రచారం సాగిన నేపథ్యంలో.. హోం గ్రౌండ్, బయటి మైదానం అనే తేడా లేకుండా ఆడియెన్స్ అతడి ఆటను చూసేందుకు భారీగా తరలివచ్చారు. అతడు కనిపిస్తే చాలు.. ఒక్క బంతి ఆడితే చాలు.. అభిమానుల ఉత్సాహం రెట్టింపైపోయింది. ఈలలు, కేరింతలతో మైదానాలను హోరెత్తించారు. స్టేడియం మొత్తం దద్దరిల్లేలా అరుస్తూ నానా హంగామా చేశారు. ఎంతలా అంటే.. ఒకనొక దశలో ఈ శబ్దాలు 120 డెసిబెల్స్ స్థాయికి చేరుకున్నాయి. అవును ఈ ఆసక్తికరమైన సమాచారాన్ని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తెలిపింది.
Dhoni Dhoni Chants : చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 3వ తేదీన జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్ ధోనీ టాస్ వేసేందుకు స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వగానే.. అభిమానుల కేరింతల శబ్దం 120 డెసిబెల్స్‌కు చేరిందట. సాధారణంగా ఒక ఎయిర్‌క్రాఫ్ నుంచి వచ్చే శబ్దం కన్నా ఇది ఎక్కువట.
అదే చెన్నైలో ఏప్రిల్ 12వ తేదిన జరిగిన మ్యాచ్‌లోనూ 120 డెసిబెల్స్ సౌండ్ వచ్చిందట. ఆ తర్వాత ఈ స్టేడియంలో పలుసార్లు ఇదే స్థాయిలో మహీ నామస్మరమతో శబ్దం వచ్చిందట.
ఇకపోతే ఇతర స్టేడియాల్లో కూడా మహీ పేరు మోత మోగిపోయింది. ముంబయి, లఖ్‌నవూ స్టేడియాల్లోనూ 117 డెసిబెల్స్, బెంగళూరు, కోల్‌కతా, దిల్లీ మైదానాల్లోనూ 115 డెసిబెల్స్, జైపుర్‌లో 112 డెసిబెల్స్ సౌండ్ వచ్చిందని గణాంకాలు తెలిపాయి.
అసలు ధోనీ టాస్ వేయడానికి వచ్చినప్పుడు.. అతడిని చూసి ఆడియెన్స్, ఫ్యాన్స్ చేసే శబ్దాలతో.. అసలు ఏమీ వినిపించట్లేదని కామెంటేటర్లు కూడా పలు సార్లు చెప్పుకొచ్చారు.