IPL 2023 : విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన గొడవ మరవకముందే ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆటగాళ్ల మధ్య మరోసారి వివాదం తలెత్తింది. శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్.. దిల్లీ ప్లేయర్ ఫిలిప్ సాల్ట్‌తో వాగ్వాదానికి దిగాడు. అంతే కాకుండా మధ్యలో వచ్చిన వార్నర్‌ను కూడా గొడవకు దిగాడు. ఆఖరికి అంపైర్, ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ వచ్చి సిరాజ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
Siraj Vs Salt : శనివారం దిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా బెంగళూరుకు దిల్లీకి మధ్య మ్యాచ్ జరిగింది. ఆర్సీబీ బౌలింగ్ సమయంలో ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. క్రీజులో ఉన్న ఫిల్ సాల్ట్ అప్పటికే తొలి మూడు బంతుల్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. నాలుగో బంతిని సిరాజ్.. షార్ట్‌బాల్ వేయగా ఆన్ ది లైన్ దాటుకుంటూ వెళ్లిపోయింది. కానీ ఫీల్డ్ అంపైర్ ఆ బాల్‌కు వైడ్ ఇవ్వకపోవడం వల్ల సాల్ట్ లెగ్ అంపైర్ వైపు తిరిగాడు.
లెగ్ అంపైర్ తొలుత ఏమి చెప్పలేదు. ఆ తర్వాత బంతిని చెక్ చేసి దాన్ని వైడ్‌గా పరిగణించాడు. దీంతో సాల్ట్.. సిరాజ్ వైపు తిరిగి ఏదో అన్నాడు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న సిరాజ్.. సాల్ట్ మీదకు ఆవేశంగా దూసుకొచ్చాడు. ఇంతలో గొడవను సద్దుమణిగించేందుకు దిల్లీ కెప్టెన్ వార్నర్ వారిద్దరి మధ్యకు రాగా.. సిరాజ్ తన పెదవులపై వేలు పెట్టి ''ష్'' అన్నట్లుగా సాల్ట్‌ను చూస్తూ సైగ చేశాడు. దీంతో సాల్ట్ బౌలింగ్ వేయడానికి వెళ్లు అని అరిచాడు. ఇలా వాడి వేడీగా వాగ్వాదం జరగుతుండగా.. అంపైర్, ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ వచ్చి సిరాజ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. మ్యాచ్ సమయంలో ఆవేశంతో ఊగిపోయిన సిరాజ్-సాల్ట్ ఆ తర్వాత శాంతించారు. గేమ్ ముగిశాక ఈ ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుని కూల్ అయ్యారు.
కోహ్లీ, దాదా షేక్ హ్యాండ్..
virat and ganguly handshake : విరాట్, గంభీర్ వాగ్వాదం కంటే ముందు గంగూలీ-విరాట్ పోరు అభిమానుల్లో ఆసక్తి రేపింది. ఐపీఎల్ ముందు నుంచే ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. ఈ క్రమంలో దిల్లీ-ఆర్సీబీ తొలి మ్యాచ్‌లో ఇద్దరు ఒకరినొకరు కరచాలనం చేసుకోలేదు. అప్పట్లో ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది. అయితే శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో ఈ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కనిపించారు. దీంతో అభిమానులు కాస్త ఊరట చెందారు.